తలలన్నీ తాకట్టే

28 Jan, 2019 02:17 IST|Sakshi

అన్నపూర్ణ ఆంధ్రదేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన సీఎం చంద్రబాబు

బడ్జెట్‌ పరిధికి ఆవల ఇప్పటికే పరిమితులు దాటి రూ.95 వేల కోట్ల అప్పు 

మరో రూ.30 వేల కోట్ల కోసం బ్యాంకుల చుట్టూ అధికారులను తరుముతున్న సీఎం

చేసే అప్పులన్నీ ప్రచార ఆర్భాటాలు, ఈవెంట్లు, పప్పు బెల్లాలకే వ్యయం  

బడ్జెట్‌ పరిధిలో ప్రస్తుత అప్పు రూ.2.59 లక్షల కోట్లు 

ఇందులో రూ.1.64 లక్షల కోట్లు ఈ నాలుగేళ్లలో చేసినవే.. 

ఇంటికో ఉద్యోగం లేదా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ

2014లో ఇచ్చిన హామీని గాలికొదిలేసిన చంద్రబాబు 

భృతి ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ.లక్ష బాకీ పడ్డ ముఖ్యమంత్రి 

ఆ బకాయిలు ఇవ్వకపోగా అప్పులతో ప్రతి కుటుంబంపై సగటున రూ.2.50 లక్షల భారం మోపిన వైనం

మొత్తం అప్పు (రూ.30 వేల కోట్లు కలిపి) రూ.3.85 లక్షల కోట్లు

ఇప్పుడే పుట్టిన బిడ్డతో సహా ప్రతి ఒక్కరి తలపై ఉన్న అప్పు 75,000 రూపాయలు

సాక్షి, అమరావతి: నలభై ఏళ్ల రాజకీయ, పరిపాలనా అనుభవం తన సొంతమని నిత్యం గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ట్ర ప్రజల మెడకు అప్పుల గుదిబండ తగిలించారు. అప్పుడే పుట్టిన శిశువులతో సహా ఒక్కొక్కరి తలపై ఏకంగా రూ.75 వేల అప్పుల భారాన్ని మోపారు. రాష్ట్రాన్ని రుణాల ఊబిలో ముంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా, బడ్జెట్‌ బయట పరిమితికి మించి మరీ అప్పులు తీసుకొస్తున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేసి తీసుకొస్తున్న రూ.వేల కోట్లతో ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తున్నారా? అంటే అదీ లేదు.

రుణాలను ఆస్తుల కల్పనకు కాకుండా పప్పు బెల్లాలకు, కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమీషన్లు కొట్టేయడానికి, శంకుస్థాపనలకు, ప్రత్యేక విమానాల్లో తిరగడానికి, తనకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే కార్యక్ర మాలు, ఈవెంట్లు, ప్రచార ఆర్భాటాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ప్రయోజనం లేని పనులకు ఒకవైపు సొమ్మంతా హారతి కర్పూరం అవుతుం డగా, మరోవైపు ప్రజల నెత్తిన అప్పుల కొండ పెరిగిపోతోంది. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాల అప్పు రూ.96 వేల కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్‌ అప్పులు ఏకంగా రూ.2.59 లక్షల కోట్లకు చేరాయని సాక్షాత్తూ అకౌంటెంట్‌ జనరల్‌ ప్రిలిమినరీ అకౌంట్స్‌లో స్పష్టం చేయడం గమనార్హం. ఇప్పటికే బడ్జెట్‌ బయట రూ.95,000 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం వచ్చే రెండు నెలల్లో పరిమితికి మించి మరో రూ.30 వేల కోట్ల అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 

బడ్జెట్‌లో ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా అప్పులు చేసేందుకు నిబంధనలు అనుమతించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన దొంగ లెక్కలతో గతంలో ఇచ్చిన గ్యారెంటీలను చూపకుండా దాచేస్తూ బడ్జెట్‌ బయట పరిమితికి మించి ఎడాపెడా అప్పులు చేస్తోంది. ఎన్నికల ముందు దొరికిన చోటల్లా రుణాలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు ఆరాటపడుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధనలకు మించి బడ్జెట్‌ బయట రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని, ఆర్‌బీఐ నిబంధనలను సైతం ఉల్లంఘిస్తోందని పేర్కొంటున్నాయి. 

అప్పుల కోసం బ్యాంకులతో సీఎంవో చర్చలు 
బడ్జెట్‌ బయట వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్ర సొంత ఆదాయంలో 90 శాతం మేర అప్పులు చేసేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు వీలుంది. అయితే, ఆ పరిమితికి మించి టీడీపీ ప్రభుత్వం బడ్జెట్‌ బయట అప్పులకు గ్యారెంటీ ఇచ్చేసింది. నిబంధనల మేరకు రూ.94,555.89 కోట్ల అప్పులకు మాత్రమే ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇప్పటికే ఆ పరిమితికి మించి అదనంగా రూ.1,154.25 కోట్లకు గ్యారెంటీ ఇచ్చి బడ్జెట్‌ బయట అప్పులు చేశారు. అంటే బడ్జెట్‌ బయట మొత్తం అప్పులు రూ.95,709 కోట్లకు చేరాయి. ఇప్పుడు కొత్తగా రెండు నెలల్లోనే రూ.29,465 కోట్ల మేర అప్పులు తెచ్చేందుకుప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని వాణిజ్య బ్యాంకుల పెద్దలతో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) కార్యాలయం స్వయంగా చర్చలు జరుపుతోంది. ఈ అప్పులు తెస్తే నిబంధనలకు విరుద్ధంగా బడ్జెట్‌ బయట రూ.30,619.25 కోట్ల అప్పులు చేసినట్లవుతుందని, ఇలా చేయడం రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేడమే తప్ప మరొకటి కాదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

పరిమితి పట్టదా? 
2018 మార్చి 31 నాటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి బడ్జెట్‌ బయట చేసిన అప్పులు రూ.37,489.56 కోట్లు కాగా, 2018 డిసెంబర్‌ నాటికి ఆ అప్పులు రూ.47,379.56 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిబంధనల మేరకు రూ.47,176.33 కోట్ల మేరకు మాత్రమే బడ్జెట్‌ బయట అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉండగా, దానికి మించి ఇప్పటిదాకా రూ.48,330.58 కోట్ల అప్పులకు గ్యారెంటీ ఇచ్చేసింది. అంటే ఇప్పటికే పరిమితికి మించి బడ్జెట్‌ బయట రూ.1,154.25 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినట్లయ్యింది. 

కమీషన్‌ల కోసమే అప్పులు  
ఎన్నికలకు రెండు నెలల ముందు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల పేరుతో గ్యారెంటీ ఇచ్చేసి బడ్జెట్‌ బయట రూ.29,465 కోట్ల అప్పులు చేసేందుకు టీడీపీ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు ఫైళ్లను సిద్ధం చేసింది. వాణిజ్య బ్యాంకులతో బేరసారాలు సాగిస్తూ ఎంత ఎక్కువ వడ్డీకైనా సరే అప్పులు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అధికారులు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు. ఇలా తెస్తున్న అప్పులను కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు, ఎన్నికల ముందు అనుత్పాదక రంగాలకు వెచ్చించడానికే ముఖ్యమంత్రి తాపత్రాయ పడుతుండడం గమనార్హం.  

ఆర్థిక అత్యవసర స్థితిలోకి రాష్ట్రం 
రాష్ట్రం విడిపోయే నాటికి 13 జిల్లాలకు చెందిన అప్పు రూ.96,000 కోట్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్‌ కేవలం అప్పులే రూ.2.59 లక్షల కోట్లకు చేరాయని అకౌంటెంట్‌ జనరల్‌ ప్రిలిమినరీ అకౌంట్స్‌లో తెలియజేశారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో సర్కారు గ్యారెంటీతో తెచ్చే అప్పులను ప్రభుత్వమే తీర్చాల్సి ఉంటుందని ‘కాగ్‌’ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు తీసుకురావడంతో ప్రభుత్వానికి ఒక కొత్త అప్పులు పుట్టే వెసులుబాటు కూడా లేకుండాపోతోందని, ఆర్థిక అత్యవసర పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేస్తున్నారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

భయపెడుతున్న అప్పుల భూతం 
ఇప్పుడే పుట్టిన శిశువులను సైతం చంద్రబాబు వదలడం లేదు. వారిపైనా అప్పుల భారం మోపుతున్నారు. వచ్చే రెండు నెలల్లో చేయనున్న రూ.30 వేల కోట్ల అప్పులతో కలిపి రాష్ట్రంపై మొత్తం అప్పుల భారం రూ.3.85 లక్షల కోట్లకు చేరనుంది. అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలపై రూ.75 వేల చొప్పున అప్పు ఉంటుందన్నమాట. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి కుటుంబానికి నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబు గద్దెనెక్కి నాలుగున్నరేళ్లుగా దాటినా ఉద్యోగం, నిరుద్యోగ భృతి అనేవి ఊసే లేకుండా పోయాయి. ఈ నాలుగున్నరేళ్లలో భృతి కింద ఒక్కో కుటుంబానికి రూ.లక్షకుపైగా చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలు ఎప్పుడిస్తారో బాబు చెప్పడం లేదు. పైగా విచ్చలవిడిగా అప్పులు తెస్తూ ఆ భారాన్ని ప్రజల పైనే మోపుతున్నారు. బాబు నిర్వాకం వల్ల ఒక్కో కుటుంబంపై సగటున రూ.2.50 లక్షల అప్పుల భారం పడింది. 

రాజధాని భూములు తాకట్టు పెట్టి రూ.10,000 కోట్ల అప్పు 
రాజధాని నిర్మాణం కోసమంటూ అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రూ.10,000 కోట్ల అప్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిద్వారా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే రాజధాని భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు సంక్రమించింది. ఈ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడంతోపాటు సెక్యూరిటీగా పెట్టి సీఆర్‌డీఏ అప్పులు చేయనుంది. రూ.10,000 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జీవో జారీ చేసింది. అయితే, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పటికీ ఆస్తులను చూపించకపోతే అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల భూములను తాకట్టు పెట్టి లేదా సెక్యూరిటీగా చూపించి అప్పులు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఇప్పటికే బాండ్ల పేరుతో సీఆర్‌డీఏ రూ.2,000 కోట్ల అప్పులు చేసింది. ప్రభుత్వ క్వార్టర్స్‌ నిర్మాణం కోసం మరో రూ.3,307 కోట్ల అప్పులు తెచ్చింది. అలాగే ఇంకో రూ.5,940 కోట్ల అప్పులు చేసేందుకు ఆర్థిక శాఖ ఇటీవల ఆమోముద్ర వేసింది.  

మరిన్ని వార్తలు