ప్రజా శ్రేయస్సు కోసం జగన్‌ రావాలి

28 Jan, 2019 02:26 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు. చిత్రంలో హితేష్, వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, కృష్ణదేవరాయ

ఎన్టీఆర్‌ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆకాంక్ష

కుమారుడు హితేష్‌తో కలిసి వైఎస్‌ జగన్‌తో భేటీ

హితేష్‌.. వైఎస్సార్‌సీపీతో కలిసి పని చేస్తాడని వెల్లడి

రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మండిపాటు

జగన్‌ పదేళ్లుగా పార్టీని చక్కగా నడుపుతున్నారు..

ఈ కష్టానికి దేవుడు తప్పకుండా మంచి ఫలితం ఇస్తాడు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజా శ్రేయస్సు కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు తోడల్లుడు, సీనియర్‌ రాజకీయ వేత్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పయనించాలని తన కుమారుడు హితేష్‌ నిర్ణయించుకున్నారని, అందుకే జగన్‌ను కలుసుకున్నామని చెప్పారు. కుమారుడు దగ్గుబాటి హితేష్‌ చెంచురాంతో కలిసి ఆదివారం ఆయన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ అధికారంలోకి రాగానే ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఇదే ఆకాంక్షను తాను జగన్‌ వద్ద వ్యక్తం చేశానన్నారు. 

ఏపీలో ప్రభుత్వ పనితీరు పూర్తిగా గాడి తప్పిందని, ప్రభుత్వ డబ్బుతో దీక్షలు చేయడం సరికాదని విమర్శించారు. అసలు తన వద్ద నిధులు లేవంటూనే.. కోట్లకు కోట్లు ఖర్చు చేసి దీక్షలు చేయడం ఏమిటని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ‘జిల్లాల్లో సభల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు.. బస్సుల్లో ప్రజలను సభలకు తీసుకు వస్తున్నారు.. టెంట్లు వేస్తున్నారు, కలెక్టర్లు, ఎస్పీలు ఈ సభల కోసమే పని చేస్తున్నారు.. అధికారులంతా తమ విధులను వదలి టీడీపీ కార్యక్రమాల కోసమే నెలలో పది రోజులు పని చేయాల్సి వస్తోంది. ఇంత వరకు రైతుల రుణమాఫీ నాలుగు, ఐదు విడతల డబ్బు ఇవ్వలేదు గానీ, పోస్ట్‌ డేటెడ్‌ చెక్కుల ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు డబ్బులు ఇస్తామంటున్నారు. ఇంత విచిత్రమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా?   కేవలం ఎన్నికల ముందు రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇవ్వడం సరికాదు’ అన్నారు.
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్‌. చిత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి   

జగన్‌పై అన్నీ పుకార్లే..
జగన్‌ ప్రవర్తన గురించి ఎన్నో పుకార్లు సృష్టించారని, అయితే ఆయన్ను కలిసి మాట్లాడాక అవన్నీ ఓ పథకం ప్రకారం ప్రత్యర్థులు చేస్తున్నవనేది అర్థం అయిందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. జగన్‌ మీడియా ఇంటర్వ్యూలు, సుదీర్ఘ పాదయాత్రను గమనించానని, ఒక రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో తనకు తెలియనిది కాదన్నారు. ఇన్నేళ్లుగా ఎన్నో కష్టాలకు ఓర్చి పార్టీని నడుపుతున్న తీరు ఎంతో కష్టమైన పని అని, అందుకే జగన్‌ కష్టానికి దేవుడు తప్పకుండా మంచి ఫలితం చూపిస్తారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు పయనించడానికి వచ్చామని భేటీ సందర్భంగా తెలియ జేసినప్పుడు జగన్‌ సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు.

అసెంబ్లీ టికెట్‌ ఆశించి వచ్చారా? అని మీడియా ప్రశ్నించినప్పుడు.. పార్టీ విధి విధానాల ప్రకారం టికెట్ల కేటాయింపు ఉంటుందని, పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. తన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతారని, లేదంటే రాజకీయాల నుంచి విరమించుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తామంతా ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ, ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఇష్టాలు వారివన్నారు. రాజకీయాల్లో బిడ్డల అభిప్రాయం ప్రకారమే ఉండాలని ఏమీ లేదని, బీజేపీలో పెద్దలు కూడా.. రాజకీయాల్లోనే కొనసాగాలని పురంధేశ్వరికి సూచించారన్నారు. వైఎస్సార్‌సీపీలో ఎప్పుడు చేరుతున్నారని ప్రశ్నించగా, తమ శ్రేయోభిలాషులు, హితులందరితో మాట్లాడాలన్నారు. జగన్‌తో ఈ సమావేశం ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేస్తున్నామనే సంకేతం ఇవ్వాలనే ఇక్కడకు వచ్చామని చెప్పారు. వారు జగన్‌తో భేటీ అయినప్పుడు పార్టీ ముఖ్య నేతలు వి.విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.  

మరిన్ని వార్తలు