రిలీవింగ్‌కు.. జే‘సీ’

22 Nov, 2014 06:44 IST|Sakshi
  • గుంటూరు కమిషనర్‌గా పోస్టింగ్ వచ్చి నెలైనా వెళ్లలేని స్థితిలో జేసీ
  •  తొలుత హుద్‌హుద్.. తర్వాత కలెక్టర్ సెలవు
  •  వరుస కార్యక్రమాలతో బిజీబిజీ
  •  ప్రవీణ్‌కుమార్ రాక కోసం గుంటూరు వాసుల నిరీక్షణ
  • సాక్షి, విశాఖపట్నం : కోరుకున్న పోస్టు దక్కితే ఎవరైనా ఎగిరి గంతేస్తూ ఉత్తర్వు వచ్చిన మర్నాడే ఆ పోస్టులో చేరిపోతారు. కానీ జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. రాష్ర్టంలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైన అక్టోబర్ మొదటి వారంలోనే ఆయనకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పోస్టింగ్ దక్కింది. వెంటనే వెళ్లి చేరాలని ఆశించారు.

    అంతలో హుద్‌హుద్ తుపాను హెచ్చరికలు రావడం, తుపాను తర్వాత రిలీవ్ చేస్తానంటూ కలెక్టర్ యువరాజ్ చెప్పడంతో కాదనలేకపోయారు. కనివినీ ఎరుగని రీతిలో హుద్‌హుద్ విధ్వంసం సృష్టించడం, సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం, ఉన్నతాధికారులంతా నగరంలోనే మకాం వేసి సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షించడంతో జేసీకి కదల్లేని పరిస్థితి నెలకొంది.

    కాస్త పరిస్థితులు చక్కబడినందున రిలీవ్ అవుదామని ఆశించినప్పటికీ కలెక్టర్ కుటుంబ సమేతంగా వారంరోజుల పాటు స్వస్థలానికి వెళ్లారు. దీంతో ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 17వ తేదీన సీఎం పర్యటనతో తన రిలీవింగ్ మళ్లీ వాయిదాపడింది. ఆ తర్వాత రిలీవ్ అవుదామంటే కేంద్ర బృందం రానుండడం, కలెక్టర్ విదేశీ పర్యటనకు వెళ్లనుండడంతో మళ్లీ వాయిదాపడక తప్పని పరిస్థితి నెలకొంది.

    ఇంతలో మళ్లీ ఈ నెల 29న సీఎం వస్తున్నారన్న సమాచారంతో మళ్లీ ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు రిలీవింగ్ కోసం జేసీ నాలుగుసార్లు గుంటూరుకు రిజర్వేషన్ చేయించుకున్నారు.. చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. గుంటూరు వాసులు కొత్త మున్సిపల్ కమిషనర్ కోసం నెల రోజులుగా నిరీక్షించకతప్పడం లేదు. ఈయన రిలీవ్ కాకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ జేసీగా ఎవర్ని నియమించకపోవడమే.

మరిన్ని వార్తలు