జగన్ ఓకే అంటే కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ

9 Feb, 2014 03:50 IST|Sakshi
జగన్ ఓకే అంటే కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ

 వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ
 మాజీ మంత్రి ధర్మాన, ఎమ్మెల్యేలు విజయ్‌కుమార్, జగన్నాయకులు నేడు పార్టీలో చేరుతున్నట్టు వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్‌కుమార్, జగన్నాయకులుతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్దఎత్తున నాయకులు, శ్రేణులు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శనివారమిక్కడ విలేకరులకు తెలిపారు. తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నలిస్తే.. పార్టీలో చేరడానికి టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి సీనియర్ నాయకులతోసహా చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. కానీ మూడేళ్లుగా పార్టీకోసం శ్రమిస్తున్న నాయకులను కాదని వేరేవారికి ఇచ్చే పరిస్థితి లేదు కనుక ఆ రెండు పార్టీల్లో నాయకులు మిగిలారని అన్నారు. అయితే తమ అధ్యక్షుడు జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎల్లో మీడియా అదే పనిగా దుష్ర్పచారం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఆదివారం జరగనున్న చేరికల నేపథ్యంలో ఎల్లోగ్యాంగ్ చెంప చెల్లుమన్నట్లయిందని, ఇకనైనా బురదచల్లే కార్యక్రమాల్ని విరమించుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమ అధినేత జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని వాసిరెడ్డి వివరించారు. పార్లమెంటులో టీ-బిల్లు ఆమోదం పొందకుండా ఉండటంకోసం జాతీయపార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల నాయకుల మద్దతు కూడగడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతే అన్ని ప్రాంతాలకూ నష్టం వాటిల్లుతుందని, అందుకే కలిసుండాల్సిన ఆవశ్యకతను ‘సమైక్య శంఖారావం’ ద్వారా జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారని చెప్పారు.
 
 విభజన బిల్లుపై నివేదిక కోసం సుచరిత దరఖాస్తు
 రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చల సారాంశం, రాష్ట్రపతికి పంపిన నివేదికకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనాయకురాలు మేకతోటి సుచరిత సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేశారు. సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగా 30 రోజులకు దాటకుండా ఈ సమాచారం ఇప్పించాలని ఆమె తన దరఖాస్తులో కోరారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా