మిగిలింది ఇద్దరే

19 Feb, 2014 03:08 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ఆమోద ముద్ర వేయించిన తరుణంలో జిల్లాలో ఇక ఆ పార్టీకి ఆనం సోదరులే దిక్కు కానున్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఎటు పోవాలో తేల్చుకోలేక ఊగిసలాటలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే రంగంలోకి దిగిన ఆశావహుల్లో సైతం ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీ మారడానికి మానసికంగా సిద్ధపడ్డారు.
 
 వైఎస్సార్‌సీపీలో చోటు దక్కే పరిస్థితి లేని వారు టీడీపీ తలుపు తట్టారు.  రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ తీరుకు భిన్నంగా నిలచి అధిష్టానం విధేయులుగా ముద్ర వేసుకునేందుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తొలి నుంచి ఆ బాటలోనే నడిచారు.
 
 రోశయ్యను సీఎం పదవి నుంచి తొలగించే సమయంలో ఆ అవకాశం తనకు దక్కకుండా చేశారని రామనారాయణరెడ్డి అప్పటి నుంచే సీఎం కిరణ్ మీద లోలోన రగిలిపోతూ వస్తున్నారు. అందుకే ఆయన అధిష్టానం బాటే ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే సీఎం కొత్త పార్టీ పెట్టినా తాము వెళ్లేది లేదని, తాము కాంగ్రెస్‌లోనే ఉంటామని ఎమ్మెల్యే వివేకా బహిరంగంగానే ప్రకటించారు.
 
 ఆదివారం సీఎం సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో నిర్వహించిన ఆంతరంగిక సమావేశానికి ఈ కారణంగానే రామనారాయణరెడ్డి హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. సీఎంకు వ్యతిరేకంగా ఉంటేనే ఇప్పుడు కాకపోయినా ఇంకొంత కాలానికైనా తమకు మరింత గుర్తింపు, ప్రాధాన్యత దక్కుతాయనే నమ్మకంతోనే ఆనం సోదరులు జై కాంగ్రెస్ నినాదంతోనే ముందుకు సాగుతున్నారు. మంగళవారం తెలంగాణ బిల్లుకు లోక్‌సభలో ఆమోద ముద్ర పడినా ఆనం సోదరులు ఈ విషయం గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాలో ముఖ్య నేతలెవరూ కాంగ్రెస్‌కు మిగిలే పరిస్థితి లేనందున జరగబోయే ఎన్నికల నాటికి ఆ పార్టీకి ఆనం సోదరులే దిక్కు కానున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అడిగే వారు కూడా కనిపించని పరిస్థితుల్లో జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాలకు, పార్లమెంటు స్థానానికి తాము లేదా తమ కుటుంబ సభ్యులనో, ఇతరులనో పోటీ చేయించే బాధ్యత కూడా వీరే భుజానికెత్తుకోనున్నారు.  
 
 తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సైతం కాంగ్రెస్‌లోనే కొనసాగాలా? సీఎం పార్టీ పెడితే అటు వెళ్లాలా? లేక మరేదారైనా చూసుకోవాలా? అనే విషయంలో అనేక ఆలోచనలు చేస్తున్నారు. వాకాటి  పదవీ కాలం ముగిసే నాటికి పరిస్థితులన్నీ సద్దుమణిగే అవకాశం ఉన్నందున తొందరపడి నిర్ణయం తీసుకోరాదని ఆయన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ నష్టం చేకూర్చిందని చెప్పవచ్చు.
 

మరిన్ని వార్తలు