గుంటూరులో ‘గల్లా’ట

19 Jan, 2014 03:34 IST|Sakshi
గుంటూరులో ‘గల్లా’ట

‘దేశం’ నేతలతో మంతనాలు
 కొడుకు రాజకీయ అరంగేట్రానికి వేదికగా అధికారిక పర్యటన
 మంత్రి అరుణ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి గల్లా అరుణకుమారి ఇక్కడ నెరపిన రాజకీయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ గా టీడీపీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆమె వ్యవహారశైలి విమర్శలకు దారి తీసింది.
 
 అసలేం జరిగింది..: రూ.30కోట్లతో రూపుదిద్దుకున్న గుంటూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శనివారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. గల్లా అరుణ ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరగడంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టిన గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం(జింకానా) ఆమెను ఆహ్వానించింది. ఆస్పత్రి నిర్మాణానికి విరాళాలిచ్చిన 250మంది  ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం రాత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
 
 ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆమె కుమారుడు గల్లా జయదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అరుణ తన కుమారుడు జయదేవ్‌ను పలువురు ప్రముఖులకు పరిచయం చేశారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఎక్కువ మంది వైద్యులు ఈ గెట్ టు గెదర్‌లో ఉండటం కూడా విమర్శలకు దారి తీసింది. ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ మంత్రి వైఖరి విమర్శలకు దారి తీసింది. వేదికపైనే ఆమె విపక్షానికి చెందిన టీడీపీ నేతలతో, ఆ పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డితో సన్నిహితంగా ఉండటం చర్చనీయాంశ మైంది. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంతసేపూ మోదుగలతో  గుసగుసలాడారు.
 
 ఏఐసీసీకి ఫిర్యాదుల వెల్లువ
 గుంటూరులో టీడీపీ నేతలతో మంత్రి నెరపిన రాజకీయంపై జిల్లా కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు పంపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీసెల్ చైర్మన్ షేక్ ఖాజావలి, డీసీసీ అధికార ప్రతినిధి జల్ది రాజమోహన్ మంత్రి తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న గల్లా అరుణ కుమారి తన కుమారుడు జయదేవ్‌కు టీడీపీ ఎంపీ సీటు ఇప్పించేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆమెపై సీఎం, పీసీసీ అధ్యక్షులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
 
 సేవా దృక్పథంతోనే వైద్యులకు గుర్తింపు : గవర్నర్ నరసింహన్
 వైద్యులందరికీ సేవా దృక్ఫథం ఎంతో అవసరమని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. ఇక్కడ మిలీనియమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారం భించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ ఆస్పత్రులు పేద, మధ్య తరగతి ప్రజలకు విలువైన వైద్యాన్ని దూరం చేస్తున్నాయన్నారు. ఆస్పత్రుల యజమానులంతా సమావేశమై ‘కామన్ మినిమమ్ ఫీ’ నిర్ణయించాలని సూచించారు.

మరిన్ని వార్తలు