టీడీపీకి అనుకూలంగా ప్రచారం.. మాజీమంత్రికి నోటీసులు

9 Apr, 2019 08:33 IST|Sakshi

మాజీమంత్రి చెంగారెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీచేసిన కాంగ్రెస్‌

సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీమంత్రి చెంగారెడ్డికి ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి ఓటు వేయాలని ఓటర్లను బెదిరింపులకు దిగినందుకు ఈ మేరకు నోటీసులను జారీచేసింది. టీడీపీకి ఓటువేయకపోతే సంగతి తేలుస్తా అని ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగిన ఆయన ఆడియోలు ఇటీవల బయటకు రావడంతో పార్టీ నేతలు ఈ విధంగా స్పందించారు. చెంగారెడ్డితో పాటు ఆయన కుమార్తె ఇందిర కూడా టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో ఆమెకు కుడా నోటీసులు పంపినట్లు కమిటీ తెలిపింది. పుత్తూరు,నగరి నియోజకవర్గాల్లో నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీని తన కను సన్నల్లో నడిపిన రెడ్డివారి చెంగారెడ్డి ఇటీవల కాలంలో టీడీపీ అనుకూలంగా వ్యవహరించడంపై పార్టీ అధిష్టానం ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. 

కాగా ఎన్నికల్లో తన కుమార్తెకు నగరి టికెట్‌ కావాలని చెంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని కోరిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంగా దానికి పార్టీ నిరాకరించింది. దీంతో పార్టీపై చెంగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ నాకు తీరని అన్యాయం చేసిందని, చివరికి నా కుమార్తెకు సీటు ఇవ్వడంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నమ్మించి మొండి చెయ్యి చూపించదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాకు చేసిన అన్యాయానికి బదులుగా మేము మమ్మల్ని సాయం అడిగిన తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ విజయానికి సహకరించేందుకు నిర్ణయించుకున్నామని ఇటీవల బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు