ఓట్లు, సీట్ల కోసమే విభజన కుట్ర

9 Dec, 2013 04:29 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : యూపీఏ ప్రభుత్వం కేవలం ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్రాన్ని విభజించే కుట్రకు పూనుకుందని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోనే నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు.

సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే స్వార్థంతో తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపించారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలా నష్ట పోయేది విద్యార్థులేనని, విద్య, ఉద్యోగ అవకాశాలు కరువై, ఐటీ, తదితర కంపెనీలు రాక నిరుద్యోగులు రోడ్ల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విభజన ప్రక్రియను ఆపి వేస్తే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో కొంతైనా మనుగడ ఉంటుందని సూచించారు. విభజన విషయంలో ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

కార్యక్రమంలో వైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి పరుశురాం, నగర అధ్యక్షుడు కేవీ.మారుతీప్రకాష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కరుణాకర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటప్ప, విద్యార్థి నాయకులు సురేష్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, అజయ్, శ్రీకాంత్, పవన్, జనార్ధన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు