సినీ నటుడు మంచు మనోజ్ కు స్వల్ప గాయాలు | Sakshi
Sakshi News home page

సినీ నటుడు మంచు మనోజ్ కు స్వల్ప గాయాలు

Published Mon, Dec 9 2013 4:10 AM

సినీ నటుడు మంచు మనోజ్ కు స్వల్ప గాయాలు - Sakshi

*అంతర్జాతీయ ప్రమాణాలు గాలికి..
*ప్రయాణమంటేనే హడల్
*పర్యవేక్షణ లోపాలే కారణం

 
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) ఠారెత్తిస్తోంది. ఆదివారం సినీ నటుడు మంచు మనోజ్ ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. నిషేధిత ప్రాంతాల నుంచీ పశువులు, ఇతర వాహనాలు ఔటర్‌పైకి రావడంతో పా టు ఈ రోడ్డుపై ఎక్కడా దీపాలు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఔటర్ రహదారిపై వాహనాలు కనీసం 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. అలాం టి సమయంలో ఏదైనా పశువు అడ్డం వస్తే వేగ నియంత్రణ కాక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

కనీసం ఈ రహదారిపై లైట్లు ఉంటే దూరం నుంచే డ్రైవర్ గమనించేందుకు వీలుంటుంది. రాత్రి వేళ చిమ్మచీకట్లు అలుముకోవడంతో రోడ్డుపై పశువులు కనిపించకపోవడమే మంచు మనోజ్ కారు ప్రమాదానికి కారణమైంది. ఔటర్‌పైకి పశువులు రాకుండా రహదారికి ఇరువైపులా జాలీలు ఉన్నాయి. కోడి సైతం దూరలేని విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కొందరు గ్రామస్తులు రోడ్డుకిరువైపులా ఉన్న జాలీని కత్తిరించి రోడ్డును దాటుతుంటారు. పశువుల కాపర్లు ఇదే విధంగా చేస్తూ పశువులను రోడ్డు దాటించి తీసుకెళ్తున్నారు.

ఇది అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు ఉండటం వల్లనే ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోంది. ఔటర్‌పై సిగ్నల్ లైట్లు కూడా లేవు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించినట్టు చెబుతున్నా రహదారి పర్యవేక్షణలో మాత్రం చాలా లోపాలున్నాయి. ఔటర్‌పై పెట్రోలింగ్ నిర్వహించేం దుకు హెచ్‌ఎండీఏ ఐదు వాహనాలను ఖరీదు చేసి సైబరాబాద్ పోలీసులకు అప్పగించింది.  సిబ్బంది కొరతతో అవి ఇప్పటికీ రోడ్డెక్కలేదు. పోలీసు పెట్రోలింగ్ ఉంటే నడిరోడ్డుపై మృతి చెంది ఉన్న గేదెను గమనించేవారు. ఈ విషయాన్ని ఎవరు గమనించకపోవడంతోనే మంచు మనోజ్ కారు ప్రమాదానికి కారణమైంది.
 

Advertisement
Advertisement