పునాదుల్లోనే అవినీతి పురుగు

23 Dec, 2013 01:26 IST|Sakshi

కాట్రేనికోన, న్యూస్‌లైన్ :  కాట్రేనికోన వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధులతో, యార్డు నిధులతో చేపట్టిన గోడౌన్లు, ఇతర కట్టడాల నిర్మాణ ంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. కృషి వికాస్ యోజన నిధులు రూ.3.2 కోట్లతో రెండు గోడౌన్లను, రూ.కోటి 30 లక్షలతో గోడౌన్ పర్యవేక్షణ కార్యాలయం, రోడ్లు, ప్రహరీ గోడ తదితర నిర్మాణ పనులు చేపట్టారు. రూ.కోటికి పైగా యార్డు నిధులతో మరో గోడౌన్ నిర్మిస్తున్నారు. నిజానికి యార్డులో ఇప్పటికే ఉన్న గోడౌన్‌నే పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు.


అలాంటప్పుడు కొత్తగా గోడౌన్ల నిర్మాణమే అవసరం లేదనుకుంటే.. దానికి తోడు నిర్మాణంలో మట్టితో కలిసిన నాసిరకం కంకర, ఇసుక, ఇనుము వాడటంతో పాటు సిమెంట్‌ను తగిన మోతాదులో  వినియోగించడం లేదు. నాణ్యత లేని సామగ్రితోనే గోడౌన్ల బీములు, పిల్లర్లు నిర్మిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలోనే బీమ్‌లు బీటలు వారి పోతున్నాయి. యార్డు కార్యక్రమాల నిర్వహణకు నిర్మిస్తున్న భవనం పనుల్లో నాణ్యత లేని నాసిరకం సిమెంట్ ఇటుకలను వాడుతున్నారు.

 ఉప్పునీటితో కట్టడానికే ముప్పు
 ఇక బేస్‌మెంట్ నిర్మాణానికి ఇటుకలకు బదులు నాసిరకం పెద్దరాళ్ళను వాడడమే కాక తగిన మోతాదులో సిమెంట్‌ను వాడడం లేదు. బేస్ మెంట్‌లో నాణ్యమైన ఇసుక వేయాలనే నిబంధనను గాలికి వ దిలేశారు. అధికారుల సమక్షంలోనే కాంట్రాక్టరు బేస్‌మెంట్‌లో సముద్రపు పాయల నుంచి తెచ్చిన ఉప్పు నీటి ఇసుకను వేసినా చూస్తూ ఊరుకుంటున్నారు. ఉప్పు నీటితో సిమెంటు పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంజనీర్ల నుంచి సామాన్యుల వరకు స్వచ్ఛమైన ఇసుకనే వినియోగిస్తారు. బేస్‌మెంట్‌ను తడిపేందుకు సైతం మంచి నీటిని వినియోగిస్తారు.

బేస్‌మెంట్‌లో వేసిన ఉప్పు నీటి ఇసుక బిగుసుకునేందుకు నీరు పెట్టినపుడు దానిలోని ఉప్పు శాతం నీటితో కలసి గోడౌన్ గోడలకు చేరే ప్రమాదం ఉంది. ఉప్పు నీటికి ఇసుముకు తుప్పు పట్టించి నాశనం చేసే గుణం ఉంది. అందుకే నిర్మాణ పనులలో ఉప్పు నీరు తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదేమీ బ్రహ్మరహస్యం కాదు. అలాంటిది కాంట్రాక్టర్ యథేచ్ఛగా ఉప్పునీటి ఇసుక వాడుతున్నా, మిగతా నిర్మాణ సామగ్రినీ నాసిరకందే వినియోగిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండడం వెనుక వారికి ముట్టాల్సిన ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు తమకు అవసరం లేకున్నా వారి కమీషన్ల కోసమే ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తుతున్నారు.


 కాగా గోడౌన్ పనుల్లో నాణ్యత లోపిస్తోందని స్థానికులు ఇటీవల కాట్రేనికోనలో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. అయినా పనులు నాసిరకంగా మెటీరియల్‌తోనే జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బేస్‌మెంట్‌లో వేసిన ఉప్పు నీటి ఇసుకను తొలగించి నాణ్యమైన ఇసుకను వేయించాలని, ప్రతి పనీ నాణ్యమైన మెటీరియల్‌తోనే జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు