ట్యాబ్లెట్స్‌లో ఇంటర్నెట్ వాడకం తక్కువే

23 Dec, 2013 02:01 IST|Sakshi
ట్యాబ్లెట్స్‌లో ఇంటర్నెట్ వాడకం తక్కువే

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగం విషయంలో ట్యాబ్లెట్స్ కంటే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని డెలాయిట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటర్నెట్ కోసం 69 శాతం మంది ల్యాప్‌టాప్‌లపై, 64 శాతం మంది స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడుతున్నారట. కేవలం 24 శాతం మంది ట్యాబ్లెట్లను వాడుతున్నారట. హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్ నగరాల్లోని 2 వేల మంది వినియోగదార్లపై డెలాయిట్ ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది.
 
 స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 60 శాతం మంది డేటా కోసం మొబైల్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. ల్యాప్‌టాప్ వినియోగిస్తున్న వారిలో 80 శాతం మంది ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌ను వాడుతున్నారు. విభిన్న డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది మొబైల్ కస్టమర్లు వైఫైకి మళ్లుతున్నారట. 12 నెలలుగా  అంచనాలకు మంచి మొబైల్ బిల్లు వస్తోందని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది తెలిపారు. ఇక ట్యాబ్లెట్ కొనుగోలు సమయంలో కస్టమర్లకు బ్రాండ్ తొలి ప్రాధాన్యత కాగా, మన్నిక, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ జీవిత కాలం, డిజైన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదే స్మార్ట్‌ఫోన్లకైతే బ్యాటరీ సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తోంది. డిజైన్, మన్నిక, బ్రాండ్, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా సామర్థ్యం తర్వాతి ప్రాధాన్యతలని డెలాయిట్ వెల్లడించింది.

మరిన్ని వార్తలు