కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను రద్దు చేయాలి

7 Aug, 2015 00:47 IST|Sakshi

 ద్వారకాతిరుమల : విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ విద్యుత్ సంస్థను ఆర్థికంగా దిగజారుస్తోందని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్ అన్నారు. ద్వారకాతిరుమలలోని ఓ కల్యాణమండపంలో గురువారం విద్యుత్ ఉద్యోగ సంఘం నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని, అదనపు పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లకు ఒకసారి చేసే వేతన సవరణను ప్రభుత్వం సక్రమ పద్ధతిలో నిర్వహించాలన్నారు.
 
  కాంట్రాక్టు కార్మికుల అర్హత ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్రంలో కోటి 65 లక్షల విద్యుత్ సర్వీసులు ఉండగా, ఇవి గణనీయంగా పెరుగుతున్నాయన్నారు.  విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలకు 35 వేల మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, దీంతో పనిభారం పెరిగిపోయిందన్నారు. వెయ్యి మంది వినియోగదారులకు నిబంధనల ప్రకారం నలుగురు ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 1.91 మంది మాత్రమే ఉన్నారన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ఆర్‌కే గణపతి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాన్ని 15 శాతం పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు దాన్ని అమలు చేయలేదన్నారు. యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు సూచనలిస్తోందని ఆయన విమర్శించారు.
 
  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన 60 ఏళ్ల పదవీ విరమణ వయసును తమకు వర్తింప చేయకపోవడం బాధాకరమన్నారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లా డి 8 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. దీనిపై స్పందించకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. డ్రైవర్లకు ప్రమాద బీమా రూ.5 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం, నిత్యం ప్రమాదపుటంచున పని చేస్తున్న తమ శాఖ ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందన్నారు. విద్యుత్‌శాఖలో ఖాళీ అయిన పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థల్లో పనిచేసే అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ. 2,500 పెంచిన ప్రభుత్వం, తమ శాఖలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 3,500 లను పెంచి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. సంఘ రాష్ట్ర సలహాదారుడు ఎస్.శోభనాద్రి, రాష్ట్ర, జిల్లా ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు