భోగాపురం టెండర్ల రద్దు వెనుక అవినీతి

24 Aug, 2018 03:14 IST|Sakshi

దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి

గవర్నర్‌ నరసింహన్‌కు బీజేపీ రాష్ట్ర నేతల విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: భోగాపురం విమానాశ్రయం టెండర్ల రద్దు వెనుక భారీ అవినీతి భారీ అవినీతి దాగి ఉందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణకుమార్‌రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు మాలతిరాణిలతో కూడిన బృందం గురువారం విజయవాడలోని ఓ హోటల్‌లో బసచేసిన గవర్నర్‌ను కలసి ఈ మేరకు మూడు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు.

రాష్ట్రప్రభుత్వానికి ఎక్కువ భాగస్వామ్య వాటాతోపాటు ప్రభుత్వం కేటాయించే భూమికి ఏటా ఐదున్నర కోట్ల రూపాయలను లీజుగా కూడా చెల్లిస్తామని ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) టెండర్లు దాఖలు చేసిందని, అయితే అంతకన్నా తక్కువ వాటా ఇచ్చేందుకు ముందుకొచ్చి, భూమికి ఎటువంటి లీజు ఇవ్వడానికి ఆసక్తి చూపని జీఎంఆర్‌ సంస్థకు ప్రయోజనం కలిగించడానికి సీఎం చంద్రబాబుకున్న ఉద్దేశాలు ఈ టెండర్ల రద్దులో స్పష్టంగా తెలిసిపోతున్నాయని ఇందులో పేర్కొన్నారు.

కొత్త టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనకూడదని నిబంధన విధించడాన్ని వారు ఈ సందర్భంగా గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. పీడీ ఖాతాల కుంభకోణం, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకం, అమరావతి బాండ్ల వ్యవహారంలో అవకతవకలు, అవినీతి గురించి కూడా వారీ సందర్భంగా ప్రస్తావించారు.

చంద్రబాబే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు
రాష్ట్రంలోని భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయ టెండర్ల విషయంలో అధికార టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 125 ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తూ, విమానయాన రంగంలో అపార అనుభవముండి.. తక్కువ ధర ప్రతిపాదించిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎ.ఎ.ఐ) టెండర్లను రద్దు చేసి జీఎంఆర్‌ సంస్థకు అవకాశమిచ్చారని వారు తెలిపారు. సరైన కారణాలు చెప్పకుండా టెండర్లను రద్దు చేశారన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాదని కేవలం స్వప్రయోజనాల కోసం స్వయంగా సీఎం చంద్రబాబే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు వివరించారు. అంతేగాక కొత్త టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనరాదని నిబంధన విధించారని, దీన్నిబట్టి ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటుకున్నట్టు విదితమవుతోందని పేర్కొన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు పాలనలో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాల గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

సోము వీర్రాజు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ టెండర్లను రద్దుచేసి ప్రభుత్వం కొత్త స్కాంకు తెరతీసిందని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కట్టడానికి ప్రభుత్వరంగ సంస్థ ఏఏఐ ముందుకొస్తే ఎందుకు టెండర్లు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణాన్ని ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనరాదని ఆంక్షలు పెట్టడంలో చంద్రబాబు ఉద్దేశమేంటన్నారు. టెండర్ల రద్దుపై కోర్టులను ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలని విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు.

ఎక్కువ అప్పులు చేసి.. ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారు
జీవీఎల్‌ నరసింహారావు విలేకరులతో మాట్లాడుతూ పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరగా.. దీనిపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నానని నరసింహన్‌ తమతో చెప్పారని తెలిపారు. ఇంకా అదనంగా సమాచారముంటే ఇవ్వాలని కోరారన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా పీడీ ఖాతాలను తెరిచి జవాబుదారీతనం లేకుండా వాటిద్వారా డబ్బులు ఖర్చు చేసి రూ.53 వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని జీవీఎల్‌ ధ్వజమెత్తారు.  ప్రభుత్వం అమరావతి బాండ్ల పేరుతో అప్పులు తేవడం రాజధాని అభివృద్ధికోసం కాదని, అవినీతికోసమే అప్పులు తెచ్చారని ఆయన ఆరోపించారు. ఎక్కువ అప్పులు తెచ్చి ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు