పాత ఇళ్లకే బిల్లులు!

3 Oct, 2018 13:58 IST|Sakshi
కోడుమూరులో ఐదుసెంట్ల స్థలంలో రూ.50లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఎన్‌టీఆర్‌ గృహం చనుగొండ్లలో అధికారులు బిల్లు చేసిన పాత ఇల్లు

పల్లెల్లో ‘తమ్ముళ్ల’ దందా లబ్ధిదారులతో బేరం

ఇళ్ల మంజూరులో అర్హులైన నిరుపేదలకు మొండిచేయి

కర్నూలు, కోడుమూరు: కోడుమూరు నియోజకవర్గంలో ఎన్‌టీఆర్‌ గృహాల బిల్లుల మంజూరులో యథేచ్ఛగా దందా కొనసాగుతోంది. ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి వర్గీయులు గ్రామాల్లో ఇళ్ల బిల్లుల మంజూరులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోడుమూరు మండలానికి 900ఇళ్లు, గూడూరు మండలానికి 550 సి.బెళగల్‌ మండలానికి 1249 ఇళ్లు మంజూరయ్యాయి. ఇల్లు కట్టుకుని బిల్లుల కోసం తిరిగే నిజమైన లబ్ధిదారుడికి బిల్లులు మంజూరు కావడం లేదు. దళారులను ఆశ్రయించి డబ్బులు ముట్టజెప్పుకుంటే హౌసింగ్‌ అధికారులు క్షణాల్లో బిల్లులు చేస్తున్నారు. పాత ఇంటికి బిల్లులు చేయాలంటే లబ్ధిదారుడికి సగం, దళారులు, హౌసింగ్‌ అధికారులకు సగం బిల్లులు ఇస్తామని ఒప్పందం చేసుకుంటే  క్షణాల్లో మంజూరవుతున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరైన ఇళ్లలో 50శాతం పాతవాటికే హౌసింగ్‌ అధికారులు బిల్లులు చేశారు. పాత గృహాలను కొత్తగా పేయింటింగ్‌ వేసి కొత్త ఇల్లుగా చూపిస్తున్నారు. మరికొన్ని ఇళ్లకు ఇంటి ముందర టైల్స్‌ బిళ్లలు అతికించి కొత్త ఇంటిగా చూపించి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారు.   

పేదలకందని ఎన్‌టీఆర్‌ గృహాలు
పూరి గుడిసెల్లో, మురికివాడల్లో నివాసముంటున్న వారికి ఎన్‌టీఆర్‌ ఇళ్లు మంజూరు కావడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పెద్ద పెద్ద వ్యాపారులకు, ఇన్‌కంటాక్స్‌ చెల్లించేవారికి, కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇళ్లు మంజూరవుతున్నాయి. ఒక్కో ఇంటి మంజూరుకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు మధ్య దళారులు వసూలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 2అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. పేదలను కాదని సంపన్నులకే జన్మభూమి కమిటీ సభ్యులు గృహాలు మంజూరు చేయిస్తున్నారు.  లబ్ధిదారులు  బిల్లులు కోసంటీడీపీ నేతలను కలవకుండా నేరుగా హౌసింగ్‌ అధికారులను ఆశ్రయిస్తే నెలల తరబడి తిరగాల్సిందే. అయినా, బిల్లులు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

బిల్లుల అక్రమాలకు కొన్ని ఉదాహరణలు..
చనుగొండ్ల గ్రామానికి చెందిన ఈడిగ రామకృష్ణ పదేళ్ల క్రితం తన తండ్రి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించుకుని  కట్టుకున్నాడు. అదే ఇంటికి ఇప్పుడు కొత్తగా రంగులు వేయించి ఎన్‌టీఆర్‌ బిల్లు (ఐడీ నెం: 132620606ఎన్‌హెచ్‌1243131) మంజూరు చేయించుకున్నాడు. బిల్లు మంజూరు కోసం హౌసింగ్‌ అధికారికి రూ.30 వేలు ముట్టజెప్పుకున్నట్లు సమాచారం. ఈ ఇంటికి విద్యుత్‌ మీటర్‌ 10 సంవత్సరాల కిందటే మంజూరైంది. 6 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి రామకృష్ణ ఇంటి పన్ను చెల్లిస్తున్నాడు. అదే ఇంటికి ఎన్‌టీఆర్‌ ఇళ్లు ఎలా మంజూరు చేశారో హౌసింగ్‌ అధికారులకే తెలియాలి.
కోడుమూరు పట్టణంలో నరసమ్మ, మనోహర్‌ ఇద్దరు తల్లికొడుకు జన్మభూమి కమిటీ సభ్యులకు మామూళ్లు ముట్టజెప్పడంతో 2 ఇళ్లు (ఐడీ నెం:132621904 ఎన్‌హెచ్‌1225962, 132621904 ఎన్‌హెచ్‌1225961) మంజూరు చేయించారు. సదరు లబ్ధిదారుడు రూ.50లక్షలు విలువ చేసే అధునాతనమైన భవనాన్ని నిర్మించుకున్నాడు.  
సి.బెళగల్‌ మండలం కొండాపురంలో ఆలూరు సోమశేఖరరెడ్డి సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ ఎన్‌టీఆర్‌ ఇల్లు (ఐడీనెంః132620505 ఎన్‌హెచ్‌1256705) మంజూరు చేయించుకుని నిర్మించుకున్నాడు.  
సి.బెళగల్‌ మండలం ముడుమాలలో శేషమ్మ, పద్మావతి ఒకే కుటుంబ సభ్యులు రెండు ఇళ్లు(ఐడీనెం: 13178506 ఎఫ్‌హెచ్‌120549, 13178506ఎఫ్‌హెచ్‌111658) మంజూరు చేయించుకుని ఒక ఇల్లు కట్టుకున్నారు. బిల్లులు మాత్రం రెండిళ్లకు  మంజూరు చేయించుకున్నాడు. మధ్య దళారీ, హౌసింగ్‌ అధికారికి రూ.60వేలు ముట్టినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు