జాబు రావాలంటే.. బాబు పోవాలి.. జగన్‌ రావాలి | Sakshi
Sakshi News home page

జాబు రావాలంటే.. బాబు పోవాలి.. జగన్‌ రావాలి

Published Wed, Oct 3 2018 2:04 PM

YSRCP Leaders Slams Chandrababu naidu In Kurnool - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్ర బాబు పోయి.. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం కావాలని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య పిలుపునిచ్చారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ విద్యార్థి విభాగం కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు కొనేటి వెంకటేశ్వర్లు, సాయిరాంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని శ్రీకృష్ణదేవయరాల సర్కిల్‌లో 48 గంటల నిరుద్యోగ దీక్షకు శ్రీకారం చుట్టారు. ముందుగా జాతిపిత మహాత్మగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళుల ర్పించారు. బీవై రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మురళీకృష్ణ, పత్తికొండ, కర్నూలు సమన్వయ కర్తలు కంగాటి శ్రీదేవి, హఫీజ్‌ఖాన్‌ ముఖ్య అతిథులుగా హాజరై దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. 2014 ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు రావాలని చెప్పిన టీడీపీ నేతలు నేడు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. గాంధీ జయంతి రోజున కూడా సీఎం చంద్రబాబు నాయుడు అబద్దాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేడు ముస్టి వేసినట్లు రూ.1000 ఇవ్వడం యువతను మోసం చేయడమే అవుతుందన్నారు. ఈ విషయాన్ని యువత గమనిస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 వేలు చొప్పున 53 నెలలకు ఒక్కో అభ్యర్థికి 1.06 లక్షల రూపాయలను భృతిగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే యువతతో కలసి బంగాళా ఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో 15 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉంటే కేవలం 75 వేల మంది మాత్రమే ఉన్నారని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. ఇందులోనూ నిరుద్యోగ భృతి కోసం 10 వేల మందిని మాత్రమే ఎంపిక చేయడం యువతను మోసం చేయడమేనన్నారు.

భారీ బైక్‌ ర్యాలీ..
దీక్ష శిబిరం ప్రారంభానికి ముందు పార్టీ నందికొట్కూరు సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి యువసేన అధ్యర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి దీక్ష శిబిరం వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దీక్షలో కొనేటి వెంకటేశ్వర్లు, సాయిరాంరెడ్డి,  ఆర్‌.ఫయాజ్‌అహ్మద్, షరీఫ్, వై.రాజశేఖరరెడ్డి, హరీష్‌రెడ్డి, షేక్‌ ఫైజాన్, రెడ్డిపోగు ప్రశాంత్, కృష్ణకాంత్‌రెడ్డి, జాఫర్‌ కూర్చున్నారు.
= కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఏ రెహమాన్, సీహెచ్‌ మద్దయ్య, నాగరాజుయాదవ్, డీకే రాజశేఖర్, ఆదిమోహన్‌రెడ్డి, కరుణాకరరెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి శివ శంకర్‌ నాయుడు, మహేశ్వరరెడ్డి, సయ్యద్‌ ఆషిఫ్, రైల్వే ప్రసాద్, శేషుబాబుచౌదరి, జగన్‌మోహన్‌రెడ్డి, కంది సులోచన, ఫిరోజ్, రాజేంద్రప్రసాద్‌ నాయుడు, గోపాల్‌రెడ్డి, కొంతలపాడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం వచ్చింది
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం తన కుమారుడు లోకేష్‌కు మాత్రమే మంత్రి ఉద్యోగం ఇప్పించుకొని యువతను మోసం చేశారని విమర్శించారు. నాలుగున్నరేళ్లు ప్రజా సంక్షేమాన్ని విస్మ రించిన చంద్రబాబు ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటూ హడావుడి చేయడం ప్రజలను మభ్య పెట్టడమేన్నారు.

ప్రత్యేక హోదాతోనే యువతకు ఉద్యోగాలు...
2014 ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని భావించి అనేక పోరాటాలు చేశారని బీవై రామయ్య అన్నారు. అయితే తమ పార్టీ పోరాటాలను టీడీపీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేసిందన్నారు. చివరకు యువభేరిలకు వచ్చే విద్యార్థులు, అధ్యాపకులపై కేసులు పెట్టించిం దని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి యువత అండగా నిలిచి ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రత్యేక హోదాను సాధించి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చూడతారని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.12 లక్షల ఉద్యోగాలు ఉంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదన్నారు. ఉద్యోగ అర్హత వయసును  32 నుంచి 42 ఏళ్లకు పెంచినా అ గడువు తీరి పోయిందన్నారు. జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదరుచూస్తున్నా అదిగో.. ఇదిగో అంటూ పేపర్లు, టీవీల్లో హడావుడి చేయడం తప్పా నోటిఫికేషన్‌ మాత్రం రాలేదన్నారు.

ఉద్యోగాల కల్పనలోసీఎం విఫలం
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా సీఎం బీజేపీతో కలసి అడ్డుకోవడంతో ఒక్క పరిశ్రమ రాకపోగా నిరుద్యోగులు నష్టపోయారన్నారు. విశాఖ పారిశ్రామిక సమ్మిట్‌లో 25 లక్షల పరిశ్రమల్లో 40 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం కావాలి పిలుపునిచ్చారు. ఓర్వకల్‌ ఇండస్ట్రీయల్‌ హబ్‌లో శిలాఫలకాలు శిథిలమవుతున్నాయని ఎద్దేవా చేశారు.  

మూల్యంచెల్లించుకోవాల్సిందే..
కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ మాట్లాడుతూ.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపేందుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందన్నారు.   

 జగన్‌తోనే యువతకు న్యాయం
పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. యువతకు న్యాయం జరగాలంటే జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన టీడీపీకి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. బీజేపీతో నాలుగేళ్లు కలసి ప్రత్యేక హోదా అడ్డుకున్న సీఎంకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు.

Advertisement
Advertisement