ప్రాణదాతల కోసం ఎదురు చూపు

19 May, 2014 02:58 IST|Sakshi

ఆటలు, పాటలు, చదువే ప్రపంచంగా జీవిస్తున్న అబ్దుల్‌గఫార్ (12) ఏడాదిగా రక్తహీనతతో బాధపడుతున్నాడు. ఆ బాలుడి వైద్యానికి రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. మండలంలోని గరిమెనపెంట గ్రామానికి చెందిన తల్లిదండ్రులు కూలిపనులు చేస్తే తప్ప పూటగడవని దయనీయ స్థితి. సహృదయులు స్పందించి తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
 
 కొండాపురం, న్యూస్‌లైన్: ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న బాలుడి దీనగాధ ఇది. మండలంలోని గరిమెనపెంట గ్రామానికి చెందిన ఎస్‌కే జిలానీబాష, షరీఫ్‌ఉన్నీసా దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు అబ్దుల్‌గఫార్‌కు 12 ఏళ్లు. ఏడాది కిందట వరకు ఆడుతూ, పాడుతూ చదువుకునేవాడు. ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో నెల్లూరు నగరంలోని చిన్నపిల్లల వైద్యశాలకు తీసుకెళ్లారు. రక్తం చాలా తక్కువగా ఉందని, తెల్లరక్త కణాలు మూడు ప్యాకెట్లు, ఒక బాటిల్ రక్తం కావాలని వైద్యులు చెప్పారు. ఇంట్లోని వస్తువులను కుదువ పెట్టి వాటిని కొనుగోలు చేసినట్టు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. వాటిని ఎక్కించుకున్న తర్వాత చెన్నై వెళ్లి ఎముకల పరీక్షలు చేయించుకురావాలని వైద్యులు సూచించడంతో అబ్దుల్‌ను చెన్నైకి తీసుకెళ్లారు. రక్తం చాలా తక్కువగా ఉందని, మళ్లీ చెన్నైలో రెండు ప్యాకెట్లు ఎక్కించినట్టు తల్లిదండ్రులు చెప్పారు.
 
 రూ.30 లక్షలు అవసరం
 చెన్నైలో వైద్యులు ఎముకలను పరీక్షించాలంటే సుమారు రూ.లక్ష అవుతుందని చెప్పారు. దీంతో చేసేదేమీలేక వారు వెనుదిరిగారు. గ్రామస్తులు హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద వ్యాధి నయం చేస్తారని చెప్పడంతో అబ్దుల్‌ను అక్కడికి తీసుకెళ్లారు. బాలుడిని వైద్యులు పరీక్షించి వైద్యానికి రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని, ఆరోగ్యశ్రీ వర్తించదని తేల్చి చెప్పారు. కూలిపనులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తమకు అంతసొమ్ము తెచ్చుకునే స్తోమత లేదని బాలు డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమనసున్న మహరాజుల చల్లని మాట కోసం వారు ఎదురు చూస్తున్నారు.
 
 సాయం చేయాలనుకుంటే..
 దాతలు ఎవరైనా స్పందించి తమ కుమారునికి ప్రాణదాణం చేయాలని వారు కోరుతున్నారు.  సాయం అందించాలనుకునే వారు ఎస్‌బీఐ ఖాతా నెంబర్ 32034202717 లో నగదు జమ చేయవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 9676853871 లో సంప్రదించవచ్చు.
 

మరిన్ని వార్తలు