‘దేశం' దౌర్జన్యం

22 Nov, 2014 01:40 IST|Sakshi
‘దేశం' దౌర్జన్యం

అరండల్‌పేట(గుంటూరు)/తుళ్లూరు: తుళ్లూరులో శుక్రవారం తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై దౌర్జన్యానికి దిగారు. అదేమంటే రాజధాని రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తాము తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, భూ సమీకరణలో నష్టపోతున్న వారికి అండగా ఉండేందుకే  సభ నిర్వహిస్తున్నామని వామ పక్ష నాయకులు చెబుతున్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్ర వెనక్కి తగ్గలేదు.

కొద్ది రోజుల కిందట కాంగ్రెస్‌పార్టీ నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులపై దాడులకు దిగినట్టుగానే పది వామ పక్ష నాయకుల సభను అడ్డుకున్నారు. తుళ్లూరులో శుక్రవారం పది వామపక్షాల నాయకులు నిర్వహించిన బహిరంగసభను అక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. అడుగడుగునా సభకు ఆటంకాలు కల్పించారు.

విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయినా సభను నిర్వహిస్తుండటంతో ఓర్చుకోలేని కార్యకర్తలు వామపక్షాల నాయకులు గోబ్యాక్ అంటూ ఒక్కసారిగా సభావేదిక వద్దకు వచ్చారు. చంద్రబాబునాయుడు జిందాబాద్, టీడీపీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు.

వారిని వామపక్షాల నాయకులు సైతం ప్రతిఘటించారు. ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగారు. అప్పటి వరకు అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కనిపించకుండా పోయారు.

గొడవ పెద్దది కావడంతో ఎస్‌ఐతో పాటు మరికొద్ది మంది పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమివేశారు. మధ్యలోనే వామపక్షాల నాయకులు సభను ముగించి వెళ్లిపోయారు.

తుళ్లూరులో ఇతర పార్టీ నాయకులపై వరసగా దాడులు జరుగుతున్నా పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు.  దీనిపై పోలీసులు స్పందిస్తూ సభ నిర్వహణపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ముందస్తు అనుమతి సైతం తీసుకోలేదని చెబుతున్నారు.

దీనిపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తీవ్రంగా స్పందించారు. తాము ఇక్కడ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని చెబుతున్నా దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దాడులను తాము ఎన్నో చూశామని, కూలీలు, కౌలురైతుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేయడం తప్పు ఎలా అవుతుందన్నారు. కొంతమంది నాయకులతో చంద్రబాబు ఇలా చేయిస్తున్నారని ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

రాజధాని భూసమీకరణలో నష్టపోతున్న కౌలురైతులు, కూలీలు, చేతివృత్తుల వారికి చట్టప్రకారం రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లేకుంటే ప్రజాపోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు సొంత వ్యవహారంలా రాజధాని అంశం మారిపోయిందన్నారు. ప్రజలతో, ప్రతిపక్షాలతో చర్చించకుండా వ్యవహరిస్తున్నారన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని కోసం నిధుల సమీకరణకు చంద్రబాబు మన దేశ ప్రధాని వద్దకు వెళ్లకుండా సింగపూర్ ప్రధాని వద్దకు ఎందుకు వెళ్లారన్నారని ప్రశ్నించారు. ఇక్కడ సేకరించే 30వేల ఎకరాల్లో 6 వేల ఎకరాలు సింగపూర్ కంపెనీకి అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

ప్రపంచంలో ఎక్కడా 30వేల ఎకరాల్లో రాజధానిని నిర్మించలేదన్నారు. ఒక విధానపత్రం విడుదల చేయకుండా ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు, రైతుకూలీలు, కౌలురైతుల హక్కులను కాపాడేందుకు పోరాటాలు చేస్తామన్నారు.

తిరిగి మరోసారి తుళ్లూరు వస్తామాన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ విల్సన్, వామపక్షాల నాయకులు కోటయ్య, రమాదేవి, హరనాధ్, గుర్రం విజయ్‌కుమార్, సింహాద్రి లక్ష్మీనారాయణ, తూమాటి శివయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు