నేడు బిజిలీ బంద్‌

24 Apr, 2018 08:19 IST|Sakshi

హోదాపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరుకు నిరసన

రాత్రి 7 నుంచి 7.30 వరకు విద్యుత్‌ దీపాల ఆర్పివేత

ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు

సహకరించాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ సూచన

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మంగళవారం ‘బ్లాక్‌ డే (బిజిలీ బంద్‌)’గా పాటించాలని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆరోజు రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా లైట్లు ఆర్పివేసి నిరసన తెలపాలని రాష్ట్ర ప్రజలకు సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలను అమలు చేయాలని 4 ఏళ్లుగా కోరుతున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోనందుకు నిరసనగా బ్లాక్‌ డేకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పక్షాలు ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నా... మోదీకి అది చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే ఉందని పేర్కొన్నారు.  
 
నేడు బ్లాక్‌ డేకు సహకరించండిపార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ పిలుపు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు మంగళవారం నిర్వహించనున్న బ్లాక్‌ డేకు సహకరించాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో మంగళవారం రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు విద్యుత్‌ దీపాలను ఆర్పి బ్లాక్‌ డేగా పాటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో హోదా సాధన సమితి, సీపీఎం, సీపీఐ నాయకులు పార్టీ నేతలను సంప్రదిస్తే వారికి సహకరించాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలను ఆదేశించింది. స్థానిక వర్తక, వాణిజ్య సంఘాలను సంప్రదించడంతో పాటు ప్రజల్లోకి నేరుగా వెళ్లి బ్లాక్‌ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మనవంతు పాత్ర పోషించాలని సూచించింది.  

మరిన్ని వార్తలు