పార్టీపై ఉన్న శ్రద్ధ బాబుకు రాష్ట్రంపై లేదు

13 Nov, 2017 06:56 IST|Sakshi

అనంతపురం రూరల్‌: ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలోనికి చేర్చుకుని వారికి పదవులు కట్టబెడుతున్న చంద్రబాబు... ఆ మాత్రం శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై చూడపం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సీట్ల పెంపుకోసం కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న చంద్రబాబు...హోదా కోసం ఒక్క కేంద్రమంత్రిని ఇంతవరకూ కలిసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో పెట్టుబడు కోసం వివిధ కంపెనీలు రూ.16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు చెబుతున్న చంద్రబాబు... ఈ మూడేళ్ల కాలంలో ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 విదేశాలు తిరిగితే రాష్ట్రానికి పెట్టుబడులు రావాని.. ప్రత్యేక హోదాతోనే వస్తాయని హితవు పలికారు. అనంతరం సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోదాపై హామీలు గుప్పించిన ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌లు పచ్చి అపద్ధాలతో నవ్యాంధ్ర ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ నేతలంతా  ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. పట్టిసీమ నుంచి పోలవరం వరకు జరిగిన పనులపై సీబీఐ చేత విచారణ జరిపితే అవినీతి అక్రమాలు  నిగ్గు తేలుతాయన్నారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిన టీడీపీతో వచ్చే ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అదే జరిగితే రాష్ట్ర ప్రజలు ఆయన్ను క్షమించరన్నారు.

 ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఈనెల 20న తలపెట్టిన  అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షుడు భాగస్వామి కావాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ, నిద్రపోయిన పాలకులను నిద్రలేపి ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసమే అసెంబ్లీని ముట్టడిస్తున్నామన్నారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ మాట్లాడుతూ,  ప్రత్యేకహోదాతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు యువతకు లభించే ఉపాధి ఆవకాశాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నా నాయకులు నేడు మాట మార్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అలాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం అసన్నమైందన్నారు. 

 సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ మాట్లాడుతూ, ఉపాధి హామి కూలీలకు కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నా.. కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతాయన్న విషయం అందరూ గుర్తించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు కేవీ రమణ మాట్లాడారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు దాదా గాంధీ, ఏఐటీయూసీ నాయకులు రాజారెడ్డి, లింగమయ్య, శ్రీరాములు, కసాపురం రమేష్, రమణ, జాఫర్, మైనుద్దీన్, ఆర్‌పీఎస్‌ఎస్‌ శ్రీరాములు, మహిళా సమాఖ్య కార్యదర్శి పద్మావతి, చిరుతల మల్లికార్జున, విద్యార్థి సంఘం నాయకులు లింగారెడ్డి, జాన్సన్, ఆంజనేయులు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు