కిలోమీటర్‌కు రూ. 27 కోట్లు ఎక్కువ వ్యయం!

27 Nov, 2019 04:37 IST|Sakshi

రాజధానిలో రూ.13 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం ప్రారంభించిన గత టీడీపీ ప్రభుత్వం 

ఒక్కో కిలోమీటర్‌కు సగటున రూ.42 కోట్ల వ్యయం 

రూ.15 కోట్లకే కిలోమీటర్‌ రోడ్డు నిర్మిస్తున్న జాతీయ రహదారుల సంస్థ 

భారీ వ్యయంతో చేపట్టిన రోడ్ల పనులను పున:సమీక్షించేందుకు సీఆర్‌డీఏ కసరత్తు 

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖర్చు తగ్గించాలని నిర్ణయం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో అత్యంత భారీ వ్యయంతో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులను పున:సమీక్షించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) కసరత్తు చేస్తోంది. పనులన్నింటినీ విడివిడిగా సమీక్షించి, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖర్చు తగ్గించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆర్భాటాలు, అనవసర ఖర్చులను తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఆర్‌డీఏ అధికారులను ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. 

ప్రాధాన్యత ప్రకారం రోడ్ల నిర్మాణం 
ప్రస్తుతం రాజధానిలో జనాభా పెద్దగా లేదు కాబట్టి రోడ్లను మొదట రెండు వరుసలుగా నిర్మించాలని, అవసరాన్ని బట్టి విస్తరించేందుకు భూమిని అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ రహదారికి అనుసంధానం చేసే రోడ్ల నిర్మాణానికి తొలుత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకనుగుణంగా ఆయా రోడ్లకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు రైతులకిచ్చిన ప్లాట్ల లేఔట్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. అనవసర వ్యయాన్ని తగ్గించి, వీటిలో కొన్నింటి విషయంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల కోసం నిర్మిస్తున్న 115 బంగ్లాల పనులు 25 శాతం కంటే తక్కువే జరిగాయి. ఇప్పటికే 75 శాతం పూర్తయిన ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాస భవనాల పనులు మరో రూ.2,830 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే పరిస్థితి ఉండడంతో వాటిని మొదలుపెట్టనున్నారు. వచ్చే నెలలో ఈ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

రహదారుల నిర్మాణంలో అవినీతి పర్వం 
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) రాజధానిలో దాదాపు రూ.13 వేల కోట్ల విలువైన 34 రోడ్ల పనులను 23 ప్యాకేజీలుగా విభజించి, వివిధ సంస్థలకు అప్పగించింది. కిలోమీటర్‌కు సగటున రూ.42 కోట్ల భారీ వ్యయంతో ఈ రోడ్ల పనులను చేపట్టడంపై అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది. జాతీయ రహదారుల సంస్థ కిలోమీటర్‌కు కేవలం రూ.15 కోట్ల వ్యయంతో రోడ్లు నిర్మిస్తుండగా, రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం అందుకు రెండు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం గమనార్హం. అంటే ఒక్కో కిలోమీటర్‌కు రూ.27 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజధానిలో పనుల విషయంలో సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గించాలని, అవసరాన్ని బట్టి రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 

నిధుల లభ్యతను బట్టి పనులు 
‘‘రాజధానిలో ప్రాధాన్యతను బట్టి దశల వారీగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అనవసర వ్యయం తగ్గించాలని స్పష్టం చేశారు. రాజధానిలో పనుల విషయంలో నిధుల లభ్యతను బట్టి ముందుకెళతాం’’
 – లక్ష్మీనరసింహం, సీఆర్‌డీఏ కమిషనర్‌  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా