నేరచరిత్రలో ఘనుడు బుల్లెట్‌ రాజు 

2 Feb, 2020 12:05 IST|Sakshi
చంద్రబాబుతో బుల్లెట్‌ రాజు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, బనగానపల్లె : అవుకు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గత నెల 22న సభ్యసమాజం తలదించుకునేలా 14 ఏళ్ల బాలుడిపై పైశాచికంగా లైంగికదాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త బుల్లెట్‌ రాజుకు పోలీసుల రికార్డులోనూ ఘనమైన నేరచరిత్రే ఉంది. బాలుడి లైంగిక దాడి ఘటనలో బుల్లెట్‌ రాజుతో పాటు ప్రేమసాగర్, రాజు, శ్రీధర్‌లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బుల్లెట్‌ రాజు ప్రధాన నిందితుడు. ఇక 2019 డిసెంబర్‌ 25న రమణ అనే వ్యక్తిని అటకాయించి దాడి చేసినట్లు బుల్లెట్‌ రాజుపై కేసు నమోదై ఉంది.

2013 ఆగస్టు 2న ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులోనూ ఈయనపై పోలీసులు కేసు నమోదు చేయగా, గత సంవత్సరం కొట్టివేశారు. ఇక అవుకు పోలీస్‌స్టేషన్‌లోనైతే ఏకంగా బుల్లెట్‌ రాజుపై రౌడీషీట్‌ ఉంది. గత సంవత్సరం మార్చి 16న, 2014 ఏప్రిల్‌ 23న బైండోవర్‌ కేసులు నమోదై ఉన్నాయి. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, ఉన్నతాధికారుల వద్ద బుల్లెట్‌ రాజు సన్నిహితంగా ఉండేవాడన్న ప్రచారం ఉంది. టీడీపీ నాయకుల అండ ఉందన్న ఉద్దేశంతోనే తనను ఎవరూ ఏమీ చేయలేరన్న విధంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు. కొంతకాలంగా అవుకు పట్టణంలో జులాయిగా తిరుగుతూ, అమ్మాయిల వెంటపడి వేధించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలపైనా స్థానికులు విసుగు చెందారు. కానీ ఇతనిపై స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇటీవల బాలుడిపై ఘటన చోటుచేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.    

మరిన్ని వార్తలు