కరుకు తగ్గిన ఖాకీ

20 Nov, 2015 02:18 IST|Sakshi

చిత్తూరు : చిత్తూరు పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ దారుణహత్యకు గురయ్యారు. కఠారి దంపతులు హత్య ప్రణాళికాబద్ధంగా రెక్కీ నిర్వహించి మరీ చేసిందే. ఒక్కసారిగా ఇద్దరి హత్యకు కుట్ర జరిగినా పోలీసు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పసిగట్టలేకపోయారంటే వారి పనితీరు అర్థమవుతుంది. ఓ పోలీసు అధికారి పుణ్యమా అని చిత్తూరు పోలీసులు కులాలు, వర్గాలుగా విడిపోయి శాంతిభద్రతలను గాలికొదిలేశారనే విమర్శలున్నాయి. కఠారి దంపతుల హత్యోదంతంతో పోలీసుల పనితీరు చర్చనీయాంశమయింది. పోలీసులు, ఇంటెలిజెన్స్ పని తీరుపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేసినా పోలీసుల్లో స్పందన కనిపించలేదు. హత్య జరిగి మూడు రోజులవుతున్నా పోలీసులు నిందితుల వివరాలు వెల్లడించకపోవడం పైనా విమర్శలున్నాయి.

 చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్  సమర్థుడైన అధికారిగా పేరు పొందినా  ప్రస్తుతం ఆయన సిట్ ప్రత్యేకాధికారిగా ఐదు నెలలుగా  హైదరాబాద్, విజయవాడకే పరిమితమయ్యారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులపై  నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ తదితర కేసులకు ఈయన్ను ప్రత్యేక విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. దీంతో ఎస్పీ శ్రీనివాస్ ఆ పనులకే పరిమితమయ్యారు. ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి ఇక్కడ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. మరో ఏఎస్పీ రత్న ఉన్నా ఆపరేషన్ రెడ్‌కు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఓ పోలీసు అధికారి అన్నీ తానై చిత్తూరు పోలీసు శాఖను నడిపిస్తున్నారు. శాంతిభద్రతల విషయాన్ని గాలికొదిలిన ఆ అధికారి కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు  కులాల ప్రాతిపదికన బదిలీలు చేస్తూ తన సామాజిక వర్గం, అనుకూలురైన అధికారులను నియమించే పనిలో మునిగితేలుతున్నారనే విమర్శలున్నాయి. నిబంధనలు, ప్రతిభ, సమర్థత ఆధారంగా కాకుండా పోలీసు బదిలీలు జరుగుతుండడంతో అధికారుల్లో నిర్లిప్తత చోటుచేసుకుని పనిచేసే ఆసక్తి సన్నగిల్లింది. ఉన్నతాధికారులపై అక్కసు, ఆక్రోశం వెళ్లగక్కే పరిస్థితి నెలకుంది.  అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితి లేకపోవడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది.
 
 
రౌడీయిజం జోరు

నగరంలో నాటుసారా వ్యాపారం, అక్రమ గ్రానైట్, ఇసుక రవాణా, లాటరీలు, దొంగతనాలు తదితర అక్రమ, అసాంఘిక కార్యక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు పోలీసు అధికారులు అందినకాడికి దండుకుంటూ వీటిని పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల  రౌడీయిజంతో సెటిల్‌మెంట్లకు సైతం పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇటీవల దూకు డు పెంచి పోలీసులపైనే ఎదురుతిరిగిన విషయం తెలిసిం దే. సదరు నేత తన కార్యాలయం వద్ద కొందరు వ్యాపారులను నిర్బంధించి దేహశుద్ధి చేయడమే కాక పిస్తోలు చూపి బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్  వెళ్లి ఆ నేతను మందలించే ప్రయత్నం చేయగా సీఐపైనే తిరగబడ్డారు. అతని వద్ద  నాగల్యాండ్ లెసైన్స్‌డ్ పిస్తోలు కూడా పట్టుబడింది. పోలీసుల భయం లేకపోవడం వల్లే నగరంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
 

మరిన్ని వార్తలు