3.70 లక్షల ఎకరాల్లో పంట నష్టం

23 Aug, 2018 03:10 IST|Sakshi
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం వద్దిపర్రులో నీట మునిగిన వరి పొలాలు

2.34 లక్షల ఎకరాల్లోనే అంటూ అధికారుల లెక్కలు

నష్టం అంచనాలను తగ్గించే ప్రయత్నమంటున్న రైతు సంఘాలు 

ఒక్క వరి పంటే 1.48 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా   

నష్టం వెయ్యి కోట్ల పైమాటే అంటున్న రైతుసంఘ నేతలు

ఎకరాకు రూ.15 వేలు తక్షణ సాయం ఇవ్వాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: ఎడతెరిపి లేని వర్షాలు పంటలను తుడిచిపెట్టాయి. వరుణుడి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలు రకాల పంటలు పూర్తిగా వర్షార్పణం అయ్యాయి. రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. దక్షిణ కోస్తాలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదలతో సుమారు 3.70 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా.

దెబ్బతిన్న పంటల్లో వరి మొదటి స్థానంలో ఉండగా పత్తి, మొక్కజొన్న, చెరకు, అరటి, పసుపు, కంద వంటి పంటలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు అధికార బృందాలు త్వరలో గ్రామాలలో పర్యటిస్తాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 2.34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇప్పటికిప్పడు నష్టం విలువ ఎంత అనేది చెప్పడం సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నా రైతు సంఘాలు మాత్రం వేయి కోట్లకు పైమాటే అంటున్నాయి. పంట నష్టం వివరాలను తగ్గించి చూపే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గత ఏడాది కూడా ఇలాగా నష్ట తీవ్రతను తగ్గించి చూపారని వారు గుర్తు చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున తక్షణమే సాయం అందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  

1.48 లక్షల ఎకరాల్లో వరికి దెబ్బ 
దక్షిణాకోస్తాలోని విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో దాదాపు 1.48 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగి ఉంది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలోని 16 లంక గ్రామాల భూముల్లో పంట పూర్తిగా వరద నీటిలో మునిగి ఉంది. ప్రస్తుతం ఆయా లంక గ్రామాలకు వెళ్లేందుకు పడవలు తప్ప వేరే మార్గం లేకపోవడంతో ఎంత విస్తీర్ణం మేర నీట మునిగి ఉందనేది తెలియడం లేదు. లంక గ్రామాల్లో వేసిన ఉద్యాన, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలోనే సుమారు 17,300 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 34,594 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. కోనసీమలోని లంక గ్రామాలలో పసుపు, కంద పంటలు నీట మునిగి ఉన్నాయి.  

పంట నష్ట పరిహారం ఏదీ? ఎక్కడ? 
గత మేలో కురిసిన అకాల వర్షాలకు సుమారు రూ.200 కోట్ల నష్టం జరిగినా ఇంతవరకు రైతులకు నయాపైసా చేతికి అందలేదు. అదిగో ఇదిగో అని తిప్పుతూనే ఉన్నారు. అప్పట్లో మార్కెట్‌ యార్డులలో సుమారు 7 లక్షల టన్నుల ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. నష్టం అంచనా అంటూ హడావిడి చేసి రెండు నెలల తర్వాత ఆ మొత్తాన్ని రూ.190 కోట్లకు చేర్చినా రైతులకు అందింది శూన్యమే. ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇంకెంత కాలం పడుతుందో, రైతు చేతికి వచ్చేటప్పటికీ పుణ్యకాలం ముగిసిపోతుందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. 

తెగుళ్ల బెడద– నివారణ సూచనలు 
ఎడతెరిపి లేని వర్షాల వల్ల పంటలకు తెగుళ్లు సోకే బెడద ఎక్కువగా ఉండొచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ పంట సంరక్షణకు పలు సూచనలు చేశారు. వీటిని పాటించి పంటను కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. వరి నాటు వేసిన పొలంలో అధికంగా ఉన్న నీటిని తొలగించి ఎకరానికి 15, 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ వేసుకోవాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే హెక్సా కోనాజోల్‌ గాని వాలిదామైసిన్‌ను గానీ లీటర్‌ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. పత్తి వేసి నెల రోజులు దాటితే ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ వేసుకోవాలి. కుళ్లు తెగులు, బాక్టీరియా మచ్చ తెగులు ఆశించకుండా కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 30 గ్రాముల్ని పిచికారీ చేయాలి. వంగ, టమాటా వంటి కూరగాయల పంటలకు తెగుళ్లు రాకుండా ఆక్సిక్లోరైడ్‌ను నీళ్లలో కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. పసుపుకు తాటాకు తెగులు ఆశించినట్టయితే ప్రోపికొనజోల్‌ లేదా మాంకోజెట్‌ ను పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని వార్తలు