గిట్టుపాట్లే..!

4 Jan, 2014 02:46 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు దగా పడుతున్నారు. పెట్టుబడులు కూడా దక్కించుకోలేని దీన స్థితిలో ఉన్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం.. దళారులు, వ్యాపారుల దోపిడీ కారణంగా రైతుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో వేరుశనగ ప్రధాన పంట. ఆ తరువాత వరి, మొక్కజొన్న, పత్తి, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు లాంటి పంటలు పండిస్తున్నారు.
 
 ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురిసినా పంటలు మాత్రం రికార్డు స్థాయిలో సాగయ్యాయి. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 9.26 లక్షల హెక్టార్లు కాగా... 9.51 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. సరైన సమయంలో వర్షాలు కురవక పంట దిగుబడులు దారుణంగా దెబ్బతిన్నాయి. వరి దిగుబడులు కొంత బాగున్నా.. వేరుశనగకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. 20 శాతం పంట మాత్రమే దక్కినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది వేరుశనగ 7,11,145 హెక్టార్లలో సాగైంది. దిగుబడులు 1,55,882 మెట్రిక్ టన్నులు (15.58 లక్షల క్వింటాళ్లు) మాత్రమే వచ్చాయి.
 
 మొక్కజొన్న వర్షాధారంగా 19,250 హెక్టార్లు, నీటి వసతి కింద 8,039 హెక్టార్లు... మొత్తంగా 27,289 హెక్టార్లలో సాగు చేశారు. 59,442 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. వరి 28,114 హెక్టార్లలో వేయగా... 1.70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులు అవస్థ పడుతున్నారు. దళారులు, వ్యాపారులు, మిల్లర్ల వలలో పడి అయినకాడికి అమ్ముకునే దుస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా వేరుశనగకు దారుణమైన ధర లభిస్తోంది. 42 కిలోల బస్తా రూ.1500 మాత్రమే పలుకుతోంది. సరాసరి క్వింటా ధర రూ.3,300 మించడం లేదు. తూకాల్లోనూ రైతులను భారీగా మోసగిస్తున్నారు. 42 కిలోల బస్తా మాటున 45-48 కిలోలు తీసేసుకుంటున్నారు. వేరుశనగకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.4 వేలు ఎక్కడా లభించడంలేదు.
 
 ఈ ధర లభించి ఉంటే ప్రస్తుత పంట దిగుబడులను బట్టి రైతులకు రూ.623.52 కోట్లు దక్కేది. అయితే... క్వింటాపై రూ.800 దాకా తక్కువ ఉండటంతో రూ.100 కోట్లకు పైగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసివుంటే రైతులకు ఈ నష్టం వచ్చేది కాదు. ఇక వరి సాధారణ ధాన్యం అమ్మకాల ధరలు ఆశాజనకంగా ఉన్న సోనా ధాన్యం ధర మాత్రం గిట్టుబాటు కావడం లేదు. సోనాకు కనీస మద్దతు ధర రూ.1,500 ఉండగా... బహిరంగ మార్కెట్‌లో ఇంతకంటే తక్కువగానే లభిస్తోంది.

 కొనుగోలు కేంద్రాలు ఏవీ?
 సెంట్రల్ కమిషనరేట్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) కమిషనర్ అశోక్‌గులాటే నేతృత్వంలోని కేంద్ర స్థాయి అధికారులు రాజీవ్, రఘుతో కూడిన బృందంతో పాటు మార్కెటింగ్ శాఖ ఎండీ నిస్సార్ అహ్మద్, ఆర్జేడీ రామాంజినేయులు, డెరైక్టరేట్ ఏడీ రెహమాన్, వ్యవసాయ శాఖ అడిషనల్ డెరైక్టర్ బలరాంనాయక్ తదితరులు నవంబర్ 29న అనంతపురం మార్కెట్ యార్డులో రైతులతో సమావేశమై గిట్టుబాటు ధరలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధరలు లభించక నష్టపోతున్నామని రైతులు ఏకరువు పెట్టారు. దీంతోవారంలోగా వేరుశనగ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తామని వారు హామీ ఇచ్చి వెళ్లారు.
 
 అయితే.. హిందూపురం పరిసర మండలాల్లో మార్క్‌ఫెడ్ నామమాత్రంగా నాలుగు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసింది. వాటి ద్వారా కేవలం ఏడు వేల క్వింటాళ్లు సేకరించింది. గులాటే ఆదేశాలను మార్కెటింగ్ కమిటీలు, ఆయిల్‌ఫెడ్, నాఫెడ్, మార్క్‌ఫెడ్ లాంటి సంస్థలు బేఖాతరు చేశాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి ఏ అధికారిని అడిగినా సమాధానం దాటవేస్తున్నారు.
 
 పెట్టుబడులు కూడా దక్కని వేరుశనగ
 పంట పెట్టుబడులు (కాస్ట్ ఆఫ్ కల్టివేషన్), దిగుబడుల (వాల్యూ ఆఫ్ గ్రాస్ ఈల్డ్)ను పరిగణనలోకి తీసుకుంటే వేరుశనగ నష్టాలను మిగుల్చుతోంది. ఎకరా పొలంలో వేరుశనగ వేయడానికి సగటున రూ.13,500 పెట్టుబడి వస్తుంది. పొలం దుక్కి చేయించడానికి రూ.1,000, కూలీల ఖర్చు రూ.3 వేలు, పంట తొలగింపు, నూర్పిడికి రూ.2 వేలు, విత్తనానికి రూ.5 వేలు, ఎరువులకు రూ.1,500, పురుగు మందులకు రూ.900 చొప్పున ఖర్చు వస్తుంది.
  ఈ ఏడాది ఎకరాకు సగటున మూడు బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4 వేలతో లెక్కించినా మొత్తమ్మీద ఎకరా దిగుబడిపై రూ.5 వేలకు మించి దక్కే పరిస్థితి లేదు. మొత్తమ్మీద వేరుశనగ రైతులకు ఈ ఏడాది రూ.2,500 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక వరి సాగుకు ఎకరాపై సగటున రూ. 17 వేల నుంచి రూ.18 వేలు పెట్టుబడి పెట్టగా... రూ.35 వేల విలువైన దిగుబడులు వచ్చినట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు