దేశం కోసం..!

11 Jul, 2017 02:59 IST|Sakshi
దేశం కోసం..!

ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో  సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మృతి
జమ్మూకశ్మీరులో సంఘటన
జలుమూరు మండలంలో విషాదం


జలుమూరు: దేశ సేవలో నిమగ్నమైన ఆ యువకుడు..అదే దేశం కోసం ప్రాణాలు విడిచాడు. ఉగ్రవాదులతో జరిగిన పోరులో తుపాకీ తూటా తగిలి నేలకొరిగాడు. ఈ సంఘటన జమ్మూకశ్మీరులోని కూంచీ సెక్టార్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకోగా.. జలుమూరు మండలం మాకివలస గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ కోటపల్లి గౌతమ్‌(23) కన్నుమూశాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్‌ మూడేళ్ల క్రితం సీఆర్‌పీఎఫ్‌లో జవాన్‌గా చేరారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని కూంచీ సెక్టార్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడే ప్రయత్నం చేయడంతో విధుల్లో ఉన్మ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో గౌతమ్‌ చనిపోయినట్టు సీఆర్‌పీఎఫ్‌ అధికారుల నుంచి సమాచారం వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.

కన్నతల్లి కన్నీరు..మున్నీరు
 కుమారుడు గౌతమ్‌ చనిపోయిన సమాచారం తెలుసుకున్న అతని తల్లి రజని కన్నీరు మున్నీరుగా విలపించినతీరు స్థానికులను కలచివేసింది. గౌతమ్‌  తండ్రి రాజారావు ఆరు నెలుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. గౌతమ్‌ సీఆర్‌పీఎఫ్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత రెండేళ్లు జగదల్‌పూర్‌లో పనిచేశాడు. ఇటీవలే జమ్మూకాశ్మీర్‌కు బదిలీపై వెళ్లాడు. బదిలీకి ముందు నెల రోజలు సెలవుపై  స్వగ్రామం మాకివలస వచ్చి తల్లి అక్క చెల్లుళ్లతో ఆనందంగా  గడిపాడు. వారం రోజుల క్రితమే సెలవులు పూర్తి చేసుకొని వి«ధుల్లో చేరాడు. ఇంతలో ఎదురు కాల్పుల్లో ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. అందరితో సరదాగా ఉండే గౌతమ్‌ అకాల మరణం గ్రామస్తులను సైతం కన్నీరు పెట్టించింది. మృతుడికి  అక్క, చెల్లెలు ఉన్నారు. ఒక సోదరికి ఇటీవలే వివాహం జరిగింది.

గ్రామానికి చేరిన మృతదేహం  
గౌతమ్‌ మృతదేహాన్ని అధికారులు సోమవారం రాత్రి పది గంటలకు మాకివలస గ్రామానికి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు. మృతదేçహాన్ని చూసిన అతని తల్లి రజని, బంధువులు రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. మాకు ఎవరు దిక్కంటూ కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు