అన్నింటికి మనస్సే ప్రధానం! ప్రేమతోనే గెలవాలి!

6 Nov, 2023 09:40 IST|Sakshi

బుద్ధుని కాలంలో నిగంఠనాథ పుత్రుడు అనే సాధుగురువు ఉండేవాడు. అతనికి చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో దీర్ఘ తపస్వి అనే సాధువు ఒకడు. మనస్సు, వాక్కు, శరీరం అనే మూడింటిలో శరీరమే ప్రధానం అనేది నిగంఠుని సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని దీర్ఘ తపస్వి చాలా బలీయంగా ప్రచారం చేసేవాడు. దానితో నిగంఠుని శిష్యుల్లో శ్రేష్టుడయ్యాడు.

ఈ దీర్ఘ తపస్వికి ఉపాలి అనే గృహస్తు మంచి అనుయాయి. ఉపాలి మంచి జ్ఞాని, ధనవంతుడు నిఘంటుని సాధు సంఘాన్ని అతనే పోషించేవాడు. అదే సమయంలో... బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో నలందకు వచ్చాడు. శరీరం, మనస్సు, వాక్కుల్లో బుద్ధుడు మనస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మనిషి చేసే కర్మలన్నింటికీ మనో కర్మే మూలం. మనసే అన్ని కర్మల్ని నడిపిస్తుంది అనేది బుద్ధుని సిద్ధాంతం. ఈ విషయం తెలిసి దీర్ఘ తాపసి కోపంతో... ‘‘నేను ఇప్పుడే వెళ్ళి, ఆ గౌతముణ్ణి వాదంలో ఓడించి వస్తాను’’ అని మండిపడ్డాడు. అప్పుడు ఉపాలి ‘‘గురువర్యా! ఈ మాత్రం దానికి తమరెందుకు! నేను చాలు.

బలమైన ఏనుగు నీటి తటాకంలో దిగి, ఆ నీటిని చెల్లా చెదురు చేసినట్లు గౌతముణ్ణి నా వాదంతో చెల్లా చెదురు చేసి వస్తాను’’ అని బయలుదేరాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. వాదానికి దిగాడు. అతి కొద్ది సేపటికే వాదం ముగిసింది. ఉపాలి చివరికి అన్నింటికీ మనస్సే ముఖ్యం. మనసే మూలం అని అంగీకరించాడు. ఒక వ్యక్తి తనని కర్రతో కొట్టితే... తాను ఇంతకాలం ఆ నేరం ‘‘కొట్టిన కర్రది’’ అనుకున్నానని గ్రహించాడు. ఆ తప్పు కొట్టిన చేతిది కూడా కాదు. ఆ వ్యక్తి హింసా ప్రవృత్తే కారణం అని తెలుసుకున్నాడు. ఆ ప్రవృత్తి కేంద్రం మనస్సే అనే సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. 

తాను ఇంతకాలం.. ఆ కర్రను పట్టుకుని వేలాడుతూ ఉన్నానని’’ గ్రహించాక, వెంటనే, బుద్ధునికి ప్రణమిల్లాడు. సముద్రం లోతులు చూడాలని, సముద్రంలో దిగిన ఒక ఉప్పు బొమ్మ, తాను కరిగిపోయి, ఆ సముద్రంలో లీనమైపోయినట్లు ఉపాలి మాత్రమే కాదు... ఎందరో బుద్ధుని మానవీయ సిద్ధాంతంలో కరిగిపోయారు. ఆ ధర్మ సాగరంలో బిందువులయ్యారు. ద్వేషం కంటే ప్రేమ గొప్పది. సంకుచితత్వం కంటే విశాల దృక్పథం గొప్పదని చెప్పిన తథాగత బుద్ధుడు సర్వదా శ్లాఘనీయుడే!  
– డా. బొర్రా గోవర్ధన్‌

(చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..)

మరిన్ని వార్తలు