మన పశువైద్యం అంత ‘సేఫ్‌’ కాదా!?

24 Sep, 2017 02:06 IST|Sakshi

ఈ మందులను తయారు చేసింది గుంటూరు జిల్లాకు చెందిన ‘సేఫ్‌’ కంపెనీ

ఈ కంపెనీ నిర్వాహకురాలిగా సభాపతి కోడెల కుమార్తె విజయలక్ష్మి

పశు వైద్యశాలల్లో నాసిరకం యాంటీబయాటిక్స్‌ మందులు

సాక్షి, అమరావతి: రైతుకు బర్రె, గొర్రె జీవనాడి. వ్యవసాయం భారంగా మారిన పరిస్థితుల్లో ఏ పల్లెలో చూసినా పాడి మీదే ఆధారపడి జీవిస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి గొర్రెకు, బర్రెకు జబ్బుచేస్తే వేసే మందులు కూడా నాసిరకమైనవైతే రైతు నడ్డి విరిగినట్టే. స్వయానా ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అనుభవిస్తున్నవారే ఇలాంటి నాసిరకం మందులు తయారు చేసి, అమ్ముతున్నారంటే.. ఎం త దారుణం. అధికారంలో ఉన్నాం, మా కంపెనీల జోలికొస్తే, మా మందులను ప్రశ్నిస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తుండటంతో అధికారులు సైతం నోరు మెదపడంలేదు. ‘సాక్షి’ పరిశీలనలో విస్మయపరిచే అంశాలు దృష్టికి వచ్చాయి. 

నాసిరకం యాంటీబయాటిక్స్‌
పశువులకు జబ్బుచేస్తే మనుషులకు లాగే తక్షణమే యాంటీబయాటిక్స్‌ వాడతారు. ప్రస్తుతం పశువు లకు వాడే యాంటీబయాటిక్స్‌లో ఆక్సీటెట్రాసైక్లిన్‌ అనేది చాలా ప్రధానమైనది. ఈ మందును ‘సేఫ్‌’ కంపెనీ తయారు చేసి, ప్రభుత్వ పశువైద్యశాలలకు సరఫరా చేసింది. పారదర్శకంగా ఉండాల్సిన ఈ యాంటీబయోటిక్‌ ద్రావణం రాగిజావలాగా ఉండటంతో తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలోని సహాయ సంచాలకులు ఆ మందుల బాటిళ్లను జూన్‌లోనే జాయింట్‌ డైరెక్టర్లకు పంపించారు. కానీ జాయింట్‌ డైరెక్టర్లు వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. సేఫ్‌ కంపెనీ తయారుచేసిన ఆక్సీ టెట్రాసైక్లిన్‌ మందు... ఈ ఏడాది ఫిబ్రవరిలో సరఫరా చేసినప్పుడు కూడా కర్నూలులో నాసిరకం అని తేలింది. దీనిపై పత్రికల్లో వార్తలు సైతం వచ్చాయి. ఆ తర్వాత సేఫ్‌ కంపెనీ యాజమాన్యం రంగంలోకి దిగి ఎలాంటి చర్యలూ లేకుండా చేసుకోగలిగింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఔషధ నియంత్రణ శాఖ కనీసం ఈ ఫిర్యాదులపై కన్నెత్తికూడా చూడటం లేదు. 

సేఫ్‌ కంపెనీ కోసం మార్కెట్‌ స్టాండింగ్‌ నిబంధన ఎత్తివేత 
ఒక కంపెనీనుంచి ఏ మందునైనా కొనాలంటే కనీసం మూడేళ్ల మార్కెటింగ్‌ స్టాండింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. కానీ సేఫ్‌ కంపెనీ వ్యాపారంలోకి ప్రవేశించాక ఆ నిబంధన ఎత్తేశారు. అంతేకాదు... గతంలో డీవార్మింగ్‌ మందులను రూ.230కి ఒక కంపెనీ సరఫరా చేసేది. దానినుంచి ఈ ఆర్డరు లాక్కుని సేఫ్‌ కంపెనీకి రూ.430కి ఇచ్చారు. 

మరో ఎమ్మెల్యే కంపెనీ ఉత్పత్తి కూడా నాసిరకమే
గుంటూరు జిల్లాకు టీడీపీ ఎమ్మెల్యే కంపెనీకి సంబంధించిన ఇంజక్షన్లు నాసిరకం అని తేలాయి. అభినందన అగ్రొవెట్‌ ఇండియా పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విన్‌ (ఎన్రోఫ్లాక్సిసిన్‌) ఇంజ క్షన్లను ప్రభుత్వ పశువైద్యశాలలకు పంపించారు. ఈ మందుకూడా యాంటీబయాటిక్స్‌ ఇంజక్షనే. ఈ ఇంజక్షన్‌ను కూడా ‘సేఫ్‌’ కంపెనీలోనే తయా రు చేయించారు. కాగా ఈ ఇంజక్షన్‌ నాసిరకం అని (బ్యాచ్‌ నెం.050516) ఔషధ నియంత్రణ శాఖ తేల్చింది. ఇలా నాసిరకం మందులను తయారు చేసిన కంపెనీల జాబితాను ఔషధ నియంత్రణ శాఖ వెబ్‌సైట్‌లో కూడా పెట్టింది.అయినా ఎవరూ పట్టించుకోక పోవడం విశేషం.

నా దృష్టికి రాలేదు
తూర్పుగోదావరి జిల్లాలో ఆక్సీ టెట్రాసైక్లిన్‌ ఇంజక్షన్లపై ఎలాంటి ఫిర్యాదులూ మా శాఖ దృష్టికి రాలేదు. అలాంటి ఫిర్యాదులు వస్తే తప్పకుండా పరిశీలిస్తాం. í
–మూర్తి, అసిస్టెంట్‌ డైరెక్టర్, ఔషధ నియంత్రణశాఖ, తూర్పుగోదావరి

జేడీకి ఇప్పటికే పంపించాం
ఆక్సీటెట్రా సైక్లిన్‌ ఇంజక్షన్లపై ఇప్పటికే జాయింట్‌ డైరెక్టర్లకు పంపించాం. ఆ మందుల్లో నాణ్యత కొరవడిందనే ఉద్దేశంతోనే నాణ్యతా పరీక్షలకు ఆదేశించాలని పంపించాం. ఇంతవరకూ రిపోర్టులు రాలేదు. 
–డాక్టర్‌ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, రాజమండ్రి
    
మాకు తెలియనే తెలియదు

అసలు ఇలాంటి మందులు సరఫరా చేసినట్టు మాకు తెలియనే తెలియదు. సరఫరా అయిన మందులను తెప్పించుకుని ఔషధ నియంత్రణ శాఖకు పంపిస్తాం.
–డాక్టర్‌ సోమశేఖర్, సంచాలకులు, పశు సంవర్ధకశాఖ, ఏపీ 

మరిన్ని వార్తలు