చేతివాటం

25 Jan, 2014 01:43 IST|Sakshi

సాక్షి, అనంతపురం : సాగుకు ఏ మాత్రం యోగ్యంగా లేని భూములకు  పట్టాలు ఇస్తూ అటు అధికార పార్టీ నేతలు.. ఇటు రెవెన్యూ సిబ్బంది ఎవరికి వారు అందినకాడికి దోచుకుంటున్నారు.


  అర్హులకు మొండి చేయి చూపుతూ జేబులు నింపుకుంటున్నారు. మంత్రి శైలజానాథ్ పేరు చెప్పి ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిరుపేదలకు చుక్కలు చూపిస్తున్నాడు. పట్టా.. పట్టాకు ఓ రేటు కట్టి హల్‌చల్ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. భూ పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఓట్ల రూపంలో మలుచుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. దాన్ని అదునుగా తీసుకున్న కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భూమి లేని నిరుపేదలకు పట్టాలు ఇస్తామని చెబుతూనే.. వాటిని పంపిణీ చేసే ముందు రానున్న ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేస్తామని లబ్ధిదారుల నుంచి ప్రమాణం చేయించుకునే నీచ సంస్కృతికి తెరలేపారు.
 
 ఈ క్రమంలో శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలానికి చెందిన ఓ ఉద్యోగి తాను మంత్రి శైలజానాథ్‌కు క్లాస్‌మేట్‌నంటూ ప్రచారం చేసుకుని ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఏడవ విడత భూ పంపిణీలో అర్హులైన లబ్ధిదారులను పక్కకు పెట్టి కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన జాబితాకు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీంతో అర్హులైన నిరుపేదలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎక్కువ మందికి పట్టాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకునేందుకు అటు నాయకులు.. ఇటు అధికారులు కలిసి చాలా మందికి సెంట్లలోనే భూమిని ఇచ్చారు.
 
   గుట్టల్లో పట్టాలు
 బుక్కరాయసముద్రం మండలంలోని పది గ్రామాల్లో 137 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఏడో విడత భూ పంపిణీలో పట్టాలు ఇచ్చారు. అయితే అందులో సగానికి సగం బండరాళ్లు ఉన్న గుట్టలే కావడం గమనార్హం. ఇలాంటి చోట్ల పట్టాలు మంజూరు చేసి అధికారులు మాత్రం లబ్ధిపొందారు. ఒక్కో పట్టాదారుడి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు బలవంతంగా వసూలు చేసినట్లు తెలిసింది. అయితే డబ్బులు ఇవ్వని వారికి మాత్రం తమ తడాఖా చూపిస్తున్నారు. డబ్బులిస్తే గానీ పాసు పుస్తకాలు ఇవ్వమని తెగేసి చెబుతుండడంతో కొందరు లబ్ధిదారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించినట్లు సమాచారం.

దీంతో ఒక ఉద్యోగి ‘ఎవ్వరికైనా ఫిర్యాదు చేసుకోండి.. మా మీద చర్యలు తీసుకునే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే నేను మినిష్టర్ శైలజానాథ్ క్లాస్‌మేట్‌ను. నేనేం చేసినా ఎవ్వరూ.... ఏం చేయలేరు’ అంటూ బహిరంగంగా చెబుతున్నాడు. ఫలితంగా తమకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. సాగుకు పనికి రాని భూములకు పట్టాలు ఇచ్చారని, వాటికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని మరికొందరు లబ్ధిదారులు ప్రశ్నిస్తే రెవెన్యూ సిబ్బంది విచిత్రమైన సమాధానాలు చెబుతున్నారు. ‘ పంపిణీ చేస్తున్న పట్టాలను తీసుకుని బ్యాంకుకు వెళ్లి క్రాప్ లోన్లు తెచ్చుకోండి’ అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు.
 
   సెంట్లలో భూ పంపిణీ
 భూ పంపిణీలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేసే సాగు భూమి ఎకరాల్లోనే ఉంటుంది. అయితే ఇక్కడి అధికారులు మాత్రం సెంట్లలో భూమిని ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బుక్కరాయసముద్రం మండలంలోని దండువారిపల్లిలో పార్వతమ్మ పేరుతో 70 సెంట్లు, టీ.లక్ష్మికి 50 సెంట్లు, టి.కామాక్షికి 88, శకుంతలమ్మకు 38, కుళ్లాయప్పకు 57 సెంట్లు పంపిణీ చేశారు.
 
 రెడ్డిపల్లిలో స్వాతి పేరుతో 60 సెంట్లు, అంకె తులసి పేరిట 71, సరస్వతి పేరిట 60, పుల్లమ్మ, జయమ్మ పేరిట 20, సునీత పేరిట 50 సెంట్లకు పట్టాలు ఇచ్చారు. రోటరీపురంలో చంద్రమ్మకు 67 సెంట్లు, సిద్దరాంపురంలో సరోజమ్మ పేరిట 65, జంతులూరులో పెద్దక్కకు 48, వెంకటలక్ష్మికి 50, సి.నాగమ్మకు 44, షేక్ మాబున్నీ పేరిట 40, ల క్ష్మిదేవి పేరిట 40 సెంట్లు, బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన బి.సరస్వతమ్మకు 52, వెంకటలక్ష్మికి 87 సెంట్లకు మాత్రమే పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన వారికి కూడా 1.50 ఎకరం నుంచి 2 ఎకరాల్లోపు మాత్రమే పట్టాలు ఇచ్చారు.   
 

మరిన్ని వార్తలు