కన్నడ నాట అరాచక సర్కార్‌

23 Nov, 2023 04:28 IST|Sakshi

కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు ఉత్తివే 

వాటిని నమ్మి కర్ణాటక మాదిరిగా తెలంగాణ ప్రజలు మోసపోవద్దు 

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కన్నడ నాట కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అరాచక సర్కార్‌ రాజ్యమేలుతోందని కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికార దాహంతో ఇచ్చిన ఉచిత పథకాల దుష్పరిణామాలు ఇప్పటికే కర్ణాటకపై కనిపిస్తున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలోనే దివాళా స్థితికి తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ నేతలదేనని విమర్శించారు. రాష్ట్రంలో బీజే పీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బుధవారం పార్టీ మీడియా సెంటర్‌లో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీలు ఉత్తుత్తివే అని, ప్రజలకు అవి ఏమాత్రం భరోసాను ఇవ్వలేదని స్పష్టమైందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారంటీలు ఉత్తివేనని.. వాటిని నమ్మి కర్ణాటక మాదిరిగా తెలంగాణ ప్రజలు మోసపోవద్దని చెప్పారు. ఉచిత విద్యుత్, అన్నభాగ్య తదితర పథకాలేవీ సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. ఆయా ప థకాల అమలుకు నిధుల కేటా యింపు నామమాత్రంగా చేస్తుండటంతో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీంతో మంత్రులు, పార్టీ నేతలు సాంకేతిక కారణాలను సాకుగా చూపి పథకాల అమలు సరిగా జరగడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అక్కడి ప్రజలు పథకాల అమలుకోసం నిలదీయడంతోపాటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు.

అన్న భాగ్య పథకం కింద పేదలకు పదికేజీల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చినా దానిని ఎక్కడా పూర్తిస్థాయిలో అమలుచేస్తున్న దాఖలాలు లేవన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరాను కూడా అనేక నిబంధనలు పెట్టి అటకెక్కిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్‌ హామీలను, ఇంకా బీఆర్‌ఎస్‌ వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని యడియూరప్ప చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని, ఎస్సీల వర్గీకరణ, ఉచితంగా 4 గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ వంటి వాటిని అమలు చేస్తామన్నారు  

మరిన్ని వార్తలు