ముందు చూపే మందు

12 Apr, 2019 07:48 IST|Sakshi

సాక్షి,గుంటూరు : కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మికి మధుమేహం ఉంది. కొంతకాలంలో మందులు సరిగ్గా వాడటం లేదు. పది రోజుల కిందట అకస్మికంగా స్పృహ కోల్పోవడంతో నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో శరీరంలో షుగర్‌ లెవల్స్‌ 800 ఉండటంతోపాటు, ఊపిరి తిత్తుల ఇన్‌ఫెక్షన్‌ సోకింది. వారం రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేయడంతో ప్రాణాపాయం నుంచి బయట పడింది. 

పటమటకు చెందిన వెంకటేశ్వర్లు రెండు రోజుల కిందట అకస్మాతుగా ఆయాసంతో పడిపోవడంతో నగరంలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతనికి ఇసీజీ తీయగా గుండెపోటుగా నిర్ధారణించారు. మధుమేహం కారణంగా ఛాతీ నొప్పి రాలేదని తేల్చారు. అసలు అతనికి అప్పటి వరకూ మధుమేహం ఉన్నట్లు కూడా తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలా వీరిద్దరే కాదు..ఇటీవల కాలంలో చాలా మంది మధుమేహం ఉన్నప్పటి తమకు తెలియక పోవడం, తెలిసినా మందులు వాడక పోవడంతో తీవ్రమైన దుష్సలితాలకు దారి తీస్తున్నట్లు చెపుతున్నారు, 

చిన్న వయస్సులోనే వ్యాధి బారిన
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా 20 ఏళ్లకు మధుమేహం భారిన పడుతున్నారు. జిల్లాలో 2.50 లక్షల మంది మధుమేహులు ఉండగా, మరో 4 లక్షల మంది ఫ్రీ డయాబెటిక్‌ స్టేజ్‌లో ఉన్నారు. మధుమేహుల్లో 10 శాతం మంది 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఉన్నారు. ఒకప్పుడు వంశపారంపర్యంగా 40 సంవత్సరాలు దాటిన వారిలో వచ్చేదని ఇప్పుడు 20 ఏళ్లకే వస్తుంది. 

దుష్ఫలితాలు ఇలా..
గుండె జబ్బులకు గురవుతున్న వారిలో 50 శాతం మంది మధుమేహమే కారణంగా నిర్ధారిస్తున్నారు. మధుమేహం ఉన్న వారిలో రక్తనాళాలు బిరుసుగా మారడం, స్పర్శ కోల్పోవడంతో గుండెపోటుకు గురైనప్పటికీ నొప్పి తెలియదని, నిద్రలోనే ప్రాణాలు వదిలే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మధుమేహం ఉన్న వారిలో మెదడుపోటుకు గురయ్యే వారు సైతం ఎక్కువగా ఉంటున్నారు. 

కిడ్నీలు పాడయ్యే ప్రమాదం
మధుమేహం అదుపులోలేని వారిలో దాని ప్రభా వం కిడ్నీలపై చూపుతున్నారు. కిడ్నీల పనితీరు క్షీణిస్తున్న కొద్దీ క్రియాటిన్‌ పెరడగం, రక్తపోటు అదుపులో లేకపోవడం జరుగుతుంది. డయాలజిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొం టుంది. మధుమేహం కారణంగా ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే మరలా దానిని తిరిగి యథాస్థితికి రావడం జరగదు. దీంతో డయాలసిస్‌ చేయించుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన దయనీయ స్థితి నెలకొంటుందని వైద్యులు చెపుతున్నారు. మధుమేహులు ప్రతి ఆరు నెలలకు కిడ్నీలు పరీక్షలు చేయించుకుంటే మేలు

కంటిచూపు కోల్పోయే ప్రమాదం
మధుమేహం ఉన్న వారిలో కంటిలోని రెటీనా(కంటినరం) మూసుకు పోవడం వలన చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. మధుమేహం ఎక్కువ కాలం అదుపులో లేని వారిలో కంటి రెటీనా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఉన్న చూపును కాపాడుకోవడం మినహా, పోయిన చూపును తిరిగి రావడం కుదరదని వైద్యులు చెపుతున్నారు. 

అవగాహన అవసరం
మధుమేహంపై సరైన అవగాహనతో అదుపులో ఉంచుకో వడం మేలు. మధుమేహం ఉన్న వారిలో 50 శాతం మందికి తమకు వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు. ఉన్నట్లు తెలిసిన వారిలో కూడా 50 శాతం మంది మందులు వాడుతుండగా, వారిలో సగం మంది వ్యాధిని అదుపులో ఉంచుకోగలుగుతున్నారంటే..మొత్తంగా 12.5శాతం మందిలో మాత్రమే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. కొందరు మధుమేహ లెవల్స్‌ పెరిగిపోవడంతో కోమాకు చేరుకుని చికిత్సకోసం వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారికి ఇన్సులిన్‌ థెరఫీద్వారా చికిత్స అందిస్తున్నాం. ఆహార నియమాలు పాటిం చడం, శారీరక వ్యాయామం, ఒత్తిడి లేని జీవన విధానంలో అధిగమించవచ్చు.
–డాక్టర్‌  కె వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు 

మరిన్ని వార్తలు