వాహనం ఎక్కడో...రిజిస్ట్రేషన్‌ ఇక్కడే...

27 Mar, 2018 11:54 IST|Sakshi
యానాం ఆర్‌టీవో కార్యాలయం,యానాంలో రిజిస్ట్రేషన్‌ అయిన కోట్లాది రూపాయల కారు

నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న తంతు

ఇటీవలే రూ.2.34 కోట్ల కారుకు తప్పుడు చిరునామాలతో రిజిస్ట్రేషన్‌

ఒక్క ఫిబ్రవరి నెలలోనే 18 ఇతర రాష్ట్రాల ఏసీ బస్సులకు రిజిస్ట్రేషన్లు

యానాం: ఆ శాఖలో అంతా ఇష్టారాజ్యం. ఉద్యోగుల ముసుగులో కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆమ్యామ్యాలతో తతంగమంతా నడిపిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తుంటారు. ఇష్టారాజ్యంగా లైసెన్సులు జారీ చేస్తుంటారు. వారి దగ్గరే సంబంధిత ఆఫీసు తాళం కూడా ఉండటంతో ఇక ప్రతిదీ వారిష్టమే. సంబంధిత శాఖ అధికారులు సిటిజన్‌ చార్టర్‌ పెట్టరు. ఫీజుల వివరాలు బహిర్గతం చేయరు. అన్నిటా గోప్యతే. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగులు ఎదురు తిరిగి కొట్టేంత పని చేస్తున్నారంటే వారి బరితెగింపును అర్థం చేసుకోవచ్చు.

అక్రమాలకు అడ్డాగా.. : పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కన్నా పుదుచ్చేరిలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పలు ఇతర రాష్ట్రాల వాహనాలకు యానాంలో తప్పుడు చిరునామాలు, డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు పలు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఈ నెల 20న హర్యానాలో రూ.2.32 కోట్లతో కొనుగోలు చేసిన రేంజ్‌ రోవర్‌ కారుకు ఇక్కడ తప్పుడు చిరునామాలు సృష్టించి రూ.1.22 లక్షలతో  రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో అయితే 14 శాతం చొప్పున రూ.7.28 లక్షలు అయ్యేది. ఇక్కడ అద్దెకు ఉంటున్నట్లు అడ్రస్సులు సృష్టించి, తదనంతరం ఎల్‌ఐసీ పాలసీ సంపాదించి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మార్చి 2న రేంజ్‌ రోవర్‌ చిన్న మోడల్‌ కారును గుంటూరులో కొనుగోలు చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేశారు. అలాగే ప్రతి నెలా సుమారు 30 హర్యానాకు చెందిన బస్సులను యానాంలో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 18 హర్యానాకు చెందిన ఏసీ బస్సులకు రిజిస్ట్రేషన్లు జరిగాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

60 వేల జనాభాకు అన్ని బస్సులా?
యానాం జనాభా కేవలం 60 వేలు. ఇక్కడ బస్సులు కొనుగోలు చేసేవారు చాలా తక్కువమంది ఉన్నా రిజిస్ట్రేషన్లు మాత్రం గణనీయంగానే జరుగుతున్నాయి. 2016 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 70 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఇక్కడ రిజిస్ట్రేషన్‌ అవుతున్న బస్సులేవీ యానాంలో ఉండడం లేదు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కనుసన్నల్లోనే..
యానాం రవాణా శాఖలో పని చేస్తున్న ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఇటీవల డ్రైవింగ్‌ స్కూల్‌ను తన తండ్రి పేరిట బదిలీ చేయించి, ఆ స్కూల్‌ లైసెన్సులను సహితం ఇష్టారాజ్యంగా ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్‌ స్కూల్‌ నడుపుకునే ఆ వ్యక్తి, చాలా సంవత్సరాలపాటు ఆర్‌టీవో ఆఫీసుకు బ్రోకర్‌గా వ్యవహరించేవాడు. తదనంతరం మెల్లగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా రవాణా శాఖ కార్యాలయంలో తిష్ట వేసిననాటి నుంచీ అంతా తానై నడిపిస్తున్నాడు. ఇతడికి ఏళ్ల తరబడి బదిలీ లేకుండా అక్కడే ఉంటున్న ఒక యూడీసీ స్థాయి ఉద్యోగి సహకారం తోడవడంతో ఇక్కడి అక్రమాలకు అడ్డు లేకుండా పోతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సదరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి పని కేవలం సంబంధిత పత్రాలు ప్రింటింగ్‌ తీయడమే. కానీ ఇష్టానుసారం వసూళ్లు చేస్తూ, షాడో అధికారిగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రత్యేక గది కేటాయించినప్పటికీ అతను ప్రధాన గదిలోనే ఉంటూ తతంగమంతా నడిపిస్తుంటాడు. టూ వీలర్‌ లైసెన్సుకు రూ.1015 తీసుకోవాల్సి ఉండగా రూ.1220 తీసుకుంటున్నాడు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1560గా నిర్ణయిస్తే రూ.2,100, ఆర్డినరీ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.9 వేలు ఉంటే రూ.12,500 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఫిర్యాదు...
యానాం రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యూనిట్‌లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసా యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోన వెంకటరత్నం, సుంకర స్వామినాయుడు వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు సుంకర కార్తీక్‌ తెలిపారు.

అంతా సక్రమమే..
యానాం ఆర్టీవో కార్యాలయంలో అన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని ఆర్టీవో రవిచంద్రన్‌ చెప్పారు. దీనిపై ప్రశ్నించిన ‘సాక్షి’ విలేకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు