టీడీపీ నేతలు.. దళిత ద్రోహులు

8 Apr, 2019 08:55 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు తదితరులు 

సాక్షి, ఏలూరు టౌన్‌ :  దళితులపై చంద్రబాబు హయాంలో చేసిన దాడులపై దళితులను చైతన్యవంతులను చేసేందుకు మార్చి 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారయాత్ర చేపట్టినట్టు సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు తెలిపారు. ఏలూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మనవడు నేతృత్వంలో నెలకొల్పిన సమతాసైనిక్‌ దళ్‌ దళితులపై జరుగుతోన్న దాడులపై పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో దళితులకు అభివృద్ధి, రక్షణ కావాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి  దళితుడు సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 


జిల్లాలో దాడులు ఇలా.. 
ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులను నీచంగా మాట్లాడుతూ దళితుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. గరగపర్రులో టీడీపీ ఎమ్మెల్యే శివ, అతని అనుచరులు 263 దళిత కుటుంబాలను వెలివేసి హింసించారన్నారు. నేటికీ అక్కడ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వలేదన్నారు. 4 నెలల పాటు దళితులంతా పోరాటం చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. పోరాటం చేసిన యాకోబు అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా ఆకిరిపల్లిలో అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనే అక్కసుతో ఏలూరు ఎంపీ మాగంటి బాబు అనుచరులు కలపాల వీరయ్య అనే యువకుడిని నరికి చంపారని ఆరోపించారు. అన్యాయమని ప్రశ్నించిన 25 మంది దళితులను పోలీసులతో కొట్టించి, హింసించారన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాగంటి బాబు ఇద్దరూ కలిసి దళితులపై అక్రమంగా కేసులు పెట్టించి, మూడు నెలలు జైళ్లలో పెట్టించారన్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక కలపాల అబ్రహం మాదిగ గుండెపోటుతో చనిపోయాడన్నారు.

దేవరపల్లిలో టీడీపీకి ఓటు వేయలేదనే కక్షతో 100మంది దళిత కుటుంబాలకు చెందిన సాగుభూమిని టీడీపీ ఎమ్మెల్యే చెరువుగా తవ్వించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమతాసైనిక్‌ దళ్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు మారుమూడి విక్టర్‌ ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కంచర్ల చిట్టిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి ప్రత్తిపాటి రవిశంకర్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకులు కత్తుల రవికుమార్, బి.శేఖర్, గుర్రం మాథ్యూ తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు