విహారం.. ప్రమాదకరం

9 Aug, 2019 14:33 IST|Sakshi

రెండేళ్లలో జిల్లా బీచ్‌ల్లో 22 మంది మృత్యువాత

రక్షణ జాకెట్లు లేకుండా బోటు షికారు

కూలేందుకు సిద్ధంగా జట్టీ నిర్మాణం

బీచ్‌ అంటేనే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో సరదా. సాగర తీరం చూసి తరించాలన్న ఆకాంక్ష. విశాలంగా కనిపించే బీచ్‌లు. సాగర తీరంలో ఎగిసి పడుతున్న సొగసరి అలలు. ఉవ్వెత్తున ఎగిసి దూసుకొస్తున్న కెరటాలతో సెల్ఫీలు దిగాలన్న ఉబలాట. నాటు పడవల్లో సముద్రంలో విహరించాలనే ఉరకలెత్తే ఉత్సాహం. అలల సయ్యాటతో మునిగి తేలాలన్న సరదాల మాటున విషాదాలు పొంచి ఉన్నాయి. జిల్లాలోని బీచ్‌ల్లో పర్యాటక శాఖ కానీ, పోలీసులు కానీ భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో మృతుఘంటికలు మోగుతున్నాయి. రెండేళ్లలో 22 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

సాక్షి, వాకాడు (నెల్లూరు): పర్యాటకులను ఆకర్షించే బీచ్‌లు విషాద ఘాట్‌లుగా మిగిలిపోతున్నాయి. గత అనుభవాలను, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని బీచ్‌ల్లో భద్రతా చర్యలు చేపట్టాల్సిన పర్యాటక శాఖ ఏ మాత్రం ముందు జాగ్రత్తలు చేపట్టడం లేదు. ఫలితంగా నిండు ప్రాణాలు జల సమాధి అవుతున్నాయి. జిల్లాలోని వాకాడు మండలం తూపిలిపాళెం, ఇందుకూరుపేట మండలంలో మైపాడు, తోటపల్లిగూడూరు మండలంలో కోడూరు, కావలి మండలం తుమ్మలపెంట బీచ్‌లు ఉన్నాయి. ఇక్కడికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర సమీప జిల్లాల్లోని శ్రీకాళహస్తి, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్‌ జిల్లాల ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఆదివారం, పర్యదిన సెలవుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పర్యాటకులు కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో వచ్చి సందడి చేస్తున్నారు.

ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో..
బీచ్‌ల్లోని తీరంలో పర్యాటకులు విహరించేందుకు అనువుగానే ఉంటుంది. తీరం వెంబడి లోతు తక్కువగా ఉండడంతో అలల్లో జలకాలాడుతూ సరదాగా సందడి చేస్తున్నారు. అయితే  ఈ సరదా శృతిమించడం, ప్రమాదాలను గుర్తించలేక కొంచెం లోతుకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు అయితే అలలను తప్పించుకోవడం తెలియక కొట్టుకుపోయి గల్లంతై విషాదంగా మిగిలిన ఘటనలు లేకపోలేదు. గడిచిన రెండేళ్లల్లో తూపిలిపాళెం బీచ్‌లో 6 మంది, కోడూరు బీచ్‌ల్లో 7 మంది, మైపాడు బీచ్‌లలో 8 మంది పర్యాటకులు విహారానికి వచ్చి కానరాని లోకాలకు వెళ్ళారు. తాజాగా కావలి తుమ్మలపెంట తీరంలో ఒకరు మృత్యువాతపడ్డాడు.

కనిపించని భద్రతా చర్యలు
సుదూర ప్రాంతాల నుంచే వచ్చే పర్యాటకులకు సముద్ర తీరంపై అవగాహన ఉండదు. తీరంలో దిగిన పర్యాటకులు ముందు ముందుకు వెళ్లిపోతుంటారు. అక్కడకక్కడ ప్రమాదభరిమైన గుండాలు ఉన్నాయన్న విషయం తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించేలా పర్యాటక శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయరు. అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోరు. పర్యాటకులు తీరం లోపలికి వెళ్లకుండా హెచ్చరించే పోలీసులు కనిపించరు. ప్రమాదాలు జరిగిన తర్వాత వచ్చి తదుపరి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కొందరు యువత అయితే బీచ్‌ల్లో మద్యం తాగి మత్తులో విహరిస్తూ ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. బీచ్‌ల్లో బహిరంగా మద్యపానాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు సైతం అటు వైపు చూస్తున్న దాఖాలు లేదు.

ఇంజిన్‌ బోటుల్లో సముద్రంపై విహారం
పర్యాటకుల ఉత్సాహాన్ని సైతం స్థానిక మత్స్యకారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో  విహారంలో విషాద ఘటనలు తెలిసినా పర్యాటకులు భద్రత లేకుండా సముద్రంపై విహారానికి వెళ్తున్నారు. పర్యాటకుల ఉత్సాహం మేరకు మత్స్యకారులు ఇంజిన్‌ బోటుల్లో సముద్రంపై రెండు, మూడు కిలో మీటర్లు దూరం వరకు తిప్పుతుంటారు. ముందు జాగ్రత్తగా ఎలాంటి లైఫ్‌ జాకెట్లు కూడా లేకుండా, ఒక్కో మనిషికి రూ.50 చొప్పున తీసుకుని బోటులో 20 నుంచి 25 మందిని వరకు తీసుకెళ్లి తిప్పుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సామర్థ్యానికి మించి పర్యాటకులను బోటుల్లో ఎక్కించడం వల్ల అలలు వచ్చినప్పుడు ఊగిసలాటకు ప్రమాదాల పాలవుతున్న ఘటనలు లేకపోలేదు. బీచ్‌కొచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బోటు షికార్లు చేస్తున్నారు.

మృత్యుగుండం.. జెట్టీ ప్రాంతం
తూపిలిపాళెం సముద్రంలో ఎత్తిపోతల జెట్టీ ప్రాంతం మృత్యుగుండంగా ఉంది. ఉప్పు నీటి కోసం 1990లో సముద్రం లోపల నుంచి ఏర్పాటు చేసిన ఎత్తిపోతల వంతెన (జెట్టీ) శిథిలావస్థకు చేరుకుని ప్రమాద భరితంగా ఉంది. ఈ వంతెన ఒడ్డున నుంచి దాదాపు 200 మీటర్లు వరకు సముద్రంలోకి ఉంటుంది. ప్రస్తుతం ఈ వంతెన బాగా దెబ్బతిని పిల్లర్లలో సిమెంట్‌ పెచ్చులు ఊడిపోయి ఇనుప కమ్ములు దర్శనమిస్తున్నాయి. దీని కారణంగా ఏదైనా జరగరాని జరిగితే ఎందరో ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. కొందరు మద్యం మత్తులో వంతెపై నుంచి సముద్రంలోకి దూకుతున్నారు. గతంలో ఈ వంతెనపై నుంచి దూకడం వల్ల అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. జెట్టీ నిర్మాణ ప్రాంతంలో అతి సమీపంలో కెరటాల ఉద్ధృతితో పాటు విపరీతమైన లోతు ఉంటుంది. ఇక్కడ దిగిన పర్యాటకులు కానరాని లోకాలకు వెళుతున్నారు.

ఆహ్లాదకర తీరం.. తూపిలిపాళెం బీచ్‌
తూపిలిపాళెం బీచ్‌ అంటేనే జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు, పర్యాటకులు అధిక సంఖ్యలో చేరుకుంటారు. తీరంలో ఎటు చూసినా పచ్చని సవక తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. మరో పక్క నిత్యం సముద్రపు అలలతో సుందరమైన ప్రకృతి ఇక్కడ పర్యాటకులను అలరిస్తుంది. బీచ్‌కి వచ్చిన పర్యాటకులు, విద్యార్థులు ఇక్కడి అందమైన ప్రదేశాలను సందర్శించి ఉల్లాసంగా గడిపి వెళుతుంటారు. ఈ సుందరమైన ప్రదేశం వెనుక తెలియని అతి భయంకరమైన జలగండాలు ఉన్నాయన్న కఠోర నిజం స్థానికేతరులకు ఏ మాత్రం తెలియదు. ఇక్కడ జల ప్రమాదాల పరిస్థితులను చూసేంచేందుకు ఇక్కడ పర్యాటక సిబ్బంది, ప్రమాద హెచ్చరిక బోర్డులు కనిపించవు. ఈ విషయాలేవి తెలియని పర్యాటకులు, విద్యార్థులు సముద్ర స్నానాల ఉత్సాహంలో ప్రమాదాలకు గురై ఎందరో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తూపిలిపాళెం సముద్ర తీరంలో లేకపోలేదు. గడిచిన ఐదేళ్లలో తూపిలిపాళెం తీరంలో దాదాపు 25 మందికి పైగా ప్రాణాలు విహారం మాటున జలసమాధి అయ్యాయి.

ఇలా భద్రతా చర్యలు చేపట్టాలి..
తూపిలిపాళెం సమీపాన సముద్రం మొదటి ఘాట్‌లో పర్యాటకులు స్నానాలు చేసేందుకు అనువుగా ఉంటుంది. కానీ ఎక్కువ మంది జెట్టీ అందాలను చూసేందుకు జెట్టీ వద్దకే వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మిగతా బీచ్‌ల్లో కూడా ప్రత్యేకించి ఆదివారం రోజుల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. స్నానాలు చేసే సమయంలో సముద్రం వద్ద బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసి వాటిని దాటి వెళ్లనీకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థులను విహారానికి పంపేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపాలి. తమ పిల్లలు ఎవరి సంరక్షణలో వెళుతున్నారో ఆరా తీయాలి.

మరిన్ని వార్తలు