ఫిరాయింపుల నిరోధక చట్టం పదునెక్కాలి

23 Dec, 2019 05:34 IST|Sakshi

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యం పరిహాసం కాకుండా ఉండాలంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈనెల 18న డెహ్రడూన్‌లో జరిగిన చట్టసభల సభాపతుల సదస్సుకు హాజరైన ఆయన ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘సభాపతుల సదస్సులో నేను, పలు రాష్ట్రాల సభాపతులు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనే విషయాన్ని ప్రస్తావించాం. ఈ చట్టంలో ఉన్న అస్పష్టతలు, లోపాల కారణంగా ఇప్పటికీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి.

గత శాసనసభ కాలంలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించినా అప్పటి సభాపతి దానిపై ఐదేళ్లూ నిర్ణయం తీసుకోలేదు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితిని తెచ్చింది. శాసనసభ గడువు తీరేలోపు కూడా సంబంధిత పిటిషన్లను పరిష్కరించకపోవడంతో వాటికి కాలం చెల్లిన పరిస్థితి దాపురించింది. ఈ విషయాలన్నీ సదస్సులో వివరించాను. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరాలనుకునే చట్టసభ సభ్యుడు కచ్చితంగా పదవికి రాజీనామా చేసే పార్టీ మారాల్సిన పరిస్థితి రావాలన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పాన్ని కూడా వివరించాను. రాజకీయాల్లో ఇదొక గొప్ప ముందడుగంటూ పలువురు సభాపతులు దీనిని స్వాగతించారు’ అని వివరించారు.

శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య భేదాభిప్రాయం
‘సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా  వదులుకోవాలన్న నిబంధనలో కూడా స్పష్టత లేకపోవడం వల్ల శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య భేదాభిప్రాయం తలెత్తుతోంది. ఫిరాయింపుల చట్టంలో ఉన్న విలీన నిబంధనను ఉపయోగించి పార్టీ మారుతున్నారు. దీనిపైనా సదస్సులో చర్చ జరిగింది. ఫిరాయింపులపై వివిధ రాష్ట్రాల్లో ఎదురైన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుంది.  దీని ఆధారంగా కేంద్రానికి సిఫారసులు చేస్తారు’ అని స్పీకర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు