డిగ్రీ రెండో ఏడాది ఫిజిక్స్ పరీక్ష రద్దు

28 Mar, 2015 03:36 IST|Sakshi

ఎచ్చెర్ల : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండో సంవత్సరం ఫిజిక్స్(భౌతిక శాస్త్రం) పరీక్షను వర్సిటీ అధికారులు రద్దు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు జరగాల్సిన ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు రావడంతో, వాటిని పరిశీలించి పరీక్షను రద్దు చేసినట్లు వ ర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ప్రకటించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లీక్ అయినట్లు ప్రచారంలో ఉన్న ప్రశ్నలు, తాము రూపొందించిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు ఇంచుమించు ఒకేలా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
 
 అయితే పూర్తి ప్రశ్నపత్రం లీక్ అయిందనడానికి ఇప్పటివరకు ఆధారాలు లేవని, విద్యార్థుల ఆందోళన, వారి విజ్ఞప్తి మేరకు పరీక్ష రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. గురువారం రాత్రి నుంచి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న ప్రచారం జరగడంతో అర్ధరాత్రి వేళ జల్లా ఎస్పీ ఏఎస్‌ఖాన్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశామని, తిరిగి శుక్రవార ం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని వివరించారు. పూర్తి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందా.. లేదా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలుతుందన్నారు. తిరిగి ఈ పరీక్షను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహిస్తామని వీసీ చెప్పారు. కాగా జిల్లాలోని 43 కేంద్రాల్లో 6032 మంది విద్యార్థులు ఫిజిక్స్ పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్ష రద్దయిన విషయం తెలియక శుక్రవారం మధ్యాహ్నం వారందరూ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. రద్దు విషయం తెలుసుకుని ఉసూరుమంటూ వెనుదిరిగాారు.
 
 పోలీసుల రంగ ప్రవేశం
 వాస్తవానికి గత కొన్ని రోజుల నుంచి డిగ్రీ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వర్సిటీ అధికారులు 14 బృందాలతో నిఘా పెట్టారు. రాత్రివేళల్లో సైతం స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా పెట్టారు. అయినా రెండు రోజుల క్రితం గణిత ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, ఇందులోని ప్రశ్నల జాబితాలు కాశీబుగ్గలోని జిరాక్సు కేంద్రంలో లభించాయన్న ప్రచారం జరిగింది. అలాగే గురువారం రాత్రి ఫిజిక్స్ ప్రశ్నలు వాట్సాప్, ఎస్సెమ్మెస్‌లలో హల్‌చల్ చేశాయి. శుక్రవారం జరగాల్సిన ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 11 ప్రశ్నలు గురువారం రాత్రి బయటకు వచ్చాయి. డిజై న్ చేసిన పేపర్‌లోని ప్రశ్నలతో వీటిని సరిచూసుకున్న వర్సిటీ అధికారులు చివరికి పరీక్ష రద్దు చేశారు.
 
 కాగా వర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు దీనిపై దర్యాప్తునకు శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు ఆధ్వర్యంలో ఓ బృందాన్ని జిల్లా ఎస్పీ నియమించారు. ప్రశ్నలు బయటకొచ్చినట్లు ఎక్కువ ప్రచారం జరిగిన శ్రీకాకుళం పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన పోలీసులు లీకేజీకి అవకాశం ఉన్న మార్గాల విషయంలో స్పష్టత కోసం వర్సిటీ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రం డిజైనింగ్ నుంచి స్ట్రాంగ్ రూముల కు తరలించే లోపు, అలాగే స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చాక లీక్ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో పరీక్షలు సక్రమంగా జరగాలంటే లీకేజీ అంశంపై స్పష్టత రావాలని, నిజంగా జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రిజస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 నిరాశతో వెనుదిరిగిన విద్యార్థులు
 పలాస: బీఎస్సీ ద్వితీయ సంవత్సం ఫిజిక్స్ పరీక్ష పేపర్ లీకయినట్టు జరిగిన ప్రచారం నేపథ్యంలో బీఆర్‌ఏయూ అధికారులు పరీక్షను రద్దు చేయడంతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు విషయం తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో పలు కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా అధికారులు కేటాయించారు. అయితే బీఎస్సీ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పరీక్షను యూనివర్సిటీ అధికారులు రద్దు చేస్తున్నట్లు ఆయా కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్లకు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఫోన్‌లో సమాచారం అందింది. దీంతో పరీక్ష నిర్వాహకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పరీక్ష రద్దు చేస్తున్నట్లు అధికారుల నుంచి సమాచారం అందినట్లు పరీక్షా నిర్వాహకులు చెప్పారు. అన్ని కేంద్రాల వద్ద పరీక్ష రద్దు చేస్తున్నట్లు నోటీసును బోర్డులకు అతికించారు. వీటిని చూసిన విద్యార్థులు నిరాశతో తిరుగుముఖం పట్టారు.

మరిన్ని వార్తలు