సచివాలయ ఉద్యోగ  నియామకాలపై ముమ్మర కసరత్తు 

28 Sep, 2019 08:41 IST|Sakshi

సాక్షి అనంతపురం : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలను కొలిక్కి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. వివిధ కేటగిరి పోస్టుల అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను కొలికి తీసుకురాగా.. మరికొన్నింటిపై విస్తృత కసరత్తు జరుగుతుంది. ఆయా శాఖలకు చెందిన పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలనకు వేగవంతంగా సాగుతోంది. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌–5కు సంబంధించి మెరిట్‌ లిస్ట్‌ తయారీలో ఆలస్యమవుతోంది. సాంకేతిక కారణాలు,  ఒకే పరీక్ష నాలుగు కేటగిరీలకు అర్హులు కావడం వల్ల మెరిట్‌లిస్ట్‌ తయారీలో అధికారులు ఒక అంచనాకు రాలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌–5కి మెరిట్‌ లిస్ట్‌ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉందని, ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్స్‌ వచ్చినప్పుడే అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. 

కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన.. 
పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎస్‌ఈ మహేశ్వరయ్య ఆధ్వర్యంలో రెండు రోజులుగా సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. జిల్లాలో 896 ఖాళీలు ఉండగా 853 మంది అభ్యర్థులతో మెరిట్‌లిస్ట్‌ విడుదల చేశారు. ఇప్పటి వరకూ 727 అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగా 126 మంది గైర్హాజరయ్యారు.  విలేజ్‌ సర్వీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు 896 ఉండగా 832 మందితో మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేశారు. ఇందులో 523 మంది అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరుకాగా 309 మంది గైర్హాజరయ్యారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు 282 ఉండగా రోస్టర్‌ ఆధారంగా 279 మందితో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. శుక్రవారం 140 మంది అభ్యర్థులకు  కాల్‌ లెటర్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో 95 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు.  శనివారం సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించనున్నారు. హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు 483 ఉండగా 378 మందితో మెరిట్‌ లిస్ట్‌ను అధికారులు సిద్ధం చేశారు. స్థానిక రైతు బజార్‌ వద్దగల హార్టికల్చర్‌ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించారు. సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్న సమయంలో కొంతమంది అభ్యర్థులు జాబితాలో అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు.

నేడు డీఎస్సీ రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం: డీఎస్సీ రెండోదశ ప్రొవిజనల్‌ సెలక్షన్‌ జాబితా అభ్యర్థులకు శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక గిల్డ్‌ ఆఫ్‌ సర్వీస్‌ స్కూల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా అభ్యర్థుల మొబైళ్లకు ఇదివరకే మెసెజ్‌లు వెళ్లాయని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఇంటిమేషన్‌ లెటర్, ఆధార్‌కార్డు, మూడు సెట్లు లీగల్‌ సైజ్‌ క్లాత్‌ కవర్‌ జతచేసి తీసుకురావాలని సూచించారు. జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ ఏదైనా రెండింటిలో గాని లేదా మూడింటిలో గాని ఎంపికై ఉంటే ఒక మేనేజ్‌మెంట్‌లో మాత్రమే ఆప్షన్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు.    

మరిన్ని వార్తలు