అవును.. ఆయనేం పట్టించుకోరు..!

7 Apr, 2019 10:09 IST|Sakshi
అయితా రామయ్య శ్రేష్టి సత్రం (ఫైల్‌)

అయితారామయ్య శ్రేష్టి సత్రం కూల్చి అయిదున్నరేళ్లు

సత్రానికి పూర్వ వైభవం కోసం ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు

ఆర్యవైశ్యుల స్థలాల ముందు అన్నాక్యాంటీన్‌ నిర్మాణం

సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతున్న ఎమ్మెల్యే స్వామి.. ఈ ఐదేళ్లలో ఆయన దగ్గరకు వచ్చిన ఏ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవు. సమస్యను పరిష్కరించాలని ఆయన చుట్టూ ప్రదిక్షణలు చేసినా ఫలితం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితారామయ్య శ్రేష్టి సత్రంపై అంతులేని నిర్లక్ష్యం..
సింగరాయకొండలో అయితారామయ్య శ్రేష్టి అనే ఆర్యవైశ్యుడు యాత్రికుల కోసం పట్టణ నడిబొడ్డులో సుమారు 1.50 ఎకరా స్థలంలో సత్రం, వ్యాపార సముదాయాన్ని నిర్మించి వాటిపై వచ్చే ఆదాయంతో యాత్రికులకు వసతులు కల్పించే ఏర్పాటు చేశాడు. తరువాత ఈ సత్రం ఎండోమెంటు శాఖ పరమైంది. సత్రం స్థలంలో ఉన్న దుకాణదారులకు, ఎండోమెంట్‌ శాఖకు మధ్య అద్దె విషయంలో వివాదం చెలరేగింది. దీంతో ఎండోమెంట్‌ శాఖ 2013 ఏప్రిల్‌లో సత్రం స్థలంలోని వ్యాపార సముదాయాన్ని కూల్చేశారు. అప్పటివరకు వ్యాపార కూడలికి నిలయంగా మారిన ఆ సత్రం ప్రస్తుతం మల మూత్ర విసర్జనకు నిలయంగా మారింది.

దీంతో ఏటా లక్షలాది రూపాయలను అద్దెల రూపంలో నష్టపోతున్నారు. ఈ సత్రం విషయమై న్యాయం చేయాలని ఆర్యవైశ్యులు కాళ్లు అరిగేటట్లు తిరగ్గా న్యాయం చేస్తానన్న ఎమ్మెల్యే ఐదేళ్లు కాలయాపన చేశారు. గతంలో ఈ సత్రం స్థలంలో 42 దుకాణాలు ఉండగా మరో 24 దుకాణాలకు 2013 సంవత్సరం వేలం పాటలు నిర్వహించారు. తరువాత వివాదం కారణంగా వేలంపాటలు రద్దయ్యాయి. సత్రం శిథిలావస్థకు చేరిందన్న నెపంతో అందులోని షాపులను దేవాదాయ శాఖ అధికారులు కూల్చేశారు. అయితే దుకాణదారులు 24 మంది తరువాత మాకు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. వీరికి న్యాయం చేస్తారన్న ఆశతో ఆర్యవైశ్యులు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఐదేళ్లు గడిచినా ఎటువంటి ప్రయోజనం లేదు.

పెరిగిన షాపుల బాడుగలు..
సత్రం స్థలంలోని వ్యాపారసముదాయాన్ని కూల్చేయడంతో గ్రామంలో షాపులకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో అప్పటి వరకు రూ.3 వేలు ఉన్న  షాపుల అద్దెలు ఒక్కసారిగా రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగాయి. దీనికితోడు సత్రం స్థలం ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందన్న సాకుతో సుమారు 9 నెలల క్రితం సత్రం స్థలం చుట్టూ సుమారు రూ.30 వేల అంచనా వ్యయంతో దేవస్థాన అధికారులు ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేశారు.

లక్షలాది రూపాయలు నష్టపోతున్న దేవాదాయశాఖ..
గ్రామ నడిబొడ్డున ఉన్న ఈ సత్రానికి ఒక పరిష్కారం చూపించి అందులో దుకాణాలు నిర్మిస్తే దేవాదాయశాఖకు ఇప్పటి వరకు షాపుకు సరాసరి 6 వేల రూపాయలు అద్దె వచ్చినా సుమారు రూ.2.60 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సత్రం స్థలంలో దుకాణాలు నిర్మించినట్లయితే అటు దేవాదాయశాఖకు ఇటు ప్రజలకు ఉపాధి లభించేదని, కానీ ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడిగా ఎవరికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మారాయని ప్రజలు అటు దేవాదాయశాఖ, ఇటు నాయకుల పనితీరును విమర్శిస్తున్నారు. 

అడ్డగోలుగా అన్నా క్యాంటీన్‌ నిర్మాణం..
కందుకూరు రోడ్డు సెంటర్‌లో విలువైన స్థలాలను ఆర్యవైశ్యులు కొనుగోలు చేశారు. వారు తమ స్థలంలో షాపులు నిర్మించుకుంటున్నారు. ఈ స్థలం ముందు ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలం ఉంది. ఈ స్థలంలో అన్నా క్యాంటీన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. దీనిపై ఆర్యవైశ్యులు ఎంత వేడుకున్నా ప్రయోజనం లేదు. చివరికి ఎన్నికల తేది ప్రకటించడంతో తాత్కాలికంగా అన్నా క్యాంటిన్‌ నిర్మాణం ఆపేశారు.  

పార్కును కూల్చేశారు..
స్థానిక రైల్వేస్టేషన్‌ రోడ్డులో బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పంచాయతీ స్థలంలో శికాకొల్లు సుబ్బారావు అనే పారిశ్రామికవేత్త ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్కును నిర్మించాడు. తరువాత ఈ పార్కును తొలగించి అందులో షాపులు నిర్మిద్దామని ఎమ్మెల్యే స్వామిపై పంచాయతీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. కానీ మొదట్లో ససేమిరా అన్నాడు. తరువాత ఏమైందో ఏమో గానీ రోడ్ల అభివృద్ధి పేరుతో పార్కును తొలగించి ఆ స్థలంలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సైకిల్‌ స్టాండు నిర్మించారు. ఈ పార్కు వల్ల బాటసారులకు ఉపయోగంగా ఉండటమే కాక పండగ సమయంలో ఆర్యవైశ్యులు ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగంగా ఉండేది. మండలంలో రూర్బన్‌ నిధులతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పార్కులు నిర్మిస్తుండగా ఈ విధంగా దాతల సహాయంతో నిర్మించిన పార్కును పడగొట్టడమేందని ప్రశ్నిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు