-

కూలక ముందే పాత భవనాలు కూల్చేయండి!

2 Aug, 2013 03:28 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల :  సికింద్రాబాద్‌లోని సిటిలైట్ హోటల్ కుప్పకూలి 17 మంది మృత్యువాత పడగా, మరో 19 మందికి గాయాలైన సంఘటనతో సర్కారు మేల్కొంది. శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చివేతకు ఉపక్రమించింది. జిల్లాలో శిథిలావస్థ, పాత భవనాలు ఉంటే యజమానులకు నోటీసులిచ్చి కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రిప్లాన్(డీటీసీపీ) విభాగం నుంచి జిల్లాలోని మున్సిపాలిటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సర్వే ప్రారంభించారు. తొలివిడతలో జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో 171 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని నిర్ధారించారు. ఇంకా సర్వే కొనసాగుతోంది. వచ్చే నెల రెండో వారంలోగా సర్వే పూర్తయితే శిథిల భవనాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత టీడీసీపీకి నివేదిక పంపి, శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు.
 
 శిథిలావస్థలో కార్యాలయాలు
 జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 5.25 లక్షలకు పైగా జనాభా, సుమారు 98,231 ఇళ్లు ఉన్నాయి. 3 వేలకు పైగా ప్రభుత్వ, లెక్కకు మించి ప్రైవేటు కార్యాలయాలు ఉన్నాయి. కొంతరు ఈ  పురాతన కాలంలో కట్టిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 300లకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, హాస్టళ్లు నిజాం కాలంలో నిర్మించిన భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటిలో చాలా వరకు భవానాలు శిథిలావస్థకు చే రుకున్నాయి. అద్దె తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రైవేట్ వ్యాపారులు పాతబడ్డ ఇళ్లలోనే కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయాలు, స్కూళ్లు, వసతి గృహాలు, ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయి? వాటివల్ల ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలకు ఏదైనా ప్రాణహాని ఉందా? అని తెలుసుకుని చర్యలకు ఉపక్రమించాల్సిన సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. మరోపక్క పాక్షికంగా శిథిలావస్థలో ఉన్న భవనాలు, మరమ్మతుతో ప్రమాదాలు అరికట్టగలిగే భవనాలు ఉంటే వాటిని మరమ్మతు చేయించుకోవాలని, లేనిపక్షంలో కూల్చేస్తామని భవన యజమానులకు అధకారులు నోటీసులు జారీ చేస్తున్నారు.
 
 మొక్కుబడిగా సర్వే
 జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో శిథిలావస్థ, పాత భవనాలు గుర్తించి యజమానులకు నోటీసులు ఇవ్వాలని, అనంతరం కూల్చివేయాలని రెండు వారాల క్రితమే డీటీసీపీ విభాగం మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలో ఏ మున్సిపాలిటీలోనూ పూర్తి స్థాయిలో సర్వే పూర్తి కాలేదు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో సర్వే ప్రారంభం కాలేదు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో బ్రాహ్మణవాడ, సిర్పెల్లి, పంజేషా, బడ్కమహళ్ల, కొలిపూర, భాగ్యనగర్, కుమ్మరవాడ, తాటిగూడ, మహాల క్ష్మీవాడ, ఖుర్షీద్‌నగర్ తదితర ప్రాంతాల్లో భవనాలు శిధిలావస్థలో ఉన్నాయి.
 
 ఇప్పటికే మున్సిపల్ అధికారులు 40 భవనాలు గుర్తించారు. నిర్మల్ మున్సిపల్ పరిధిలోని పంజేషాగల్లి, మార్కెట్, బ్రహ్మపురి, గురువార్‌పేట, సోమవార్‌పేట, బంగల్‌పేట, కక్బా, చింతకుంటవాడ, నాయుడువాడ, జాజులపేట ఇతర ప్రాంతాల్లో 24 భవనాలు గుర్తించారు. మందమర్రి మున్సిపల్ పరిధిలో 50, కాగ జ్‌నగర్‌లో 19, బెల్లంపల్లి 8, భైంసాలో సుమారు 30 భవనాలు కుప్పకూలే దశలో ఉన్నాయని మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఇదిలావుంటే.. పంచాయతీ ఎన్నికల కారణంగా సర్వే కాస్త ఆలస్యంగా ప్రారంభించామని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క ముందు పాఠశాలలు, వసతి గృహాల భవనాల సర్వే పూర్తి చేసి ఆ తర్వాత ఇతర భవనాల సర్వే చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని.. ఆ మేరకు సర్వే చేపడుతున్నామని బె ల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మంగతాయరు చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. శిథిలావస్థలో ఉన్న భవనాలకు వెంటనే మరమ్మతు, నేలమట్టం చేస్తే ఏవైన ప్రమాదాలు అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు