ప్రసూతి ఆస్పత్రికి మహర్దశ

20 Dec, 2014 02:18 IST|Sakshi
ప్రసూతి ఆస్పత్రికి మహర్దశ

అదనంగా రూ.57.2 కోట్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
57.30 కోట్లతో మూడువందల పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం
రూ.20 కోట్లతో అధునాతన పరికరాల కొనుగోలుకు వెసులుబాటు..!

 
తిరుపతి : రూయా ఆస్పత్రి పరిధిలోని ప్రసూతి(మెటర్నిటీ) ఆస్పత్రికి మహర్దశ పట్టనుంది. మూడు వందల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆస్పత్రికి అదనంగా రూ.57.2 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మెటర్నిటీ ఆస్పత్రి అంచనా వ్యయం రూ.77.30 కోట్లకు పెంచినట్లు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ.సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే..   రాయలసీమలో ప్రత్యేకమైన ప్రసూతి ఆసుపత్రి ఒక్క రుయా పరిధిలో మాత్రమే ఉంది. ప్రసూతి ఆసుపత్రికి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గర్భిణులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.20.10 కోట్లతో వంద పడకల ప్రసూతి ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మార్చి 29, 2012న ఉత్తర్వులు జారీచేసింది. భవన నిర్మాణ స్థాయిని వంద పడకల నుంచి మూడు వందల పడకలకు పెంచాలని డిసెంబర్ 14, 2012న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు రూ.57.20 కోట్లను(రూ.37.20 కోట్లతో భవన నిర్మాణం.. రూ.20 కోట్లతో అధునాత పరికరాల కొనుగోలు) మంజూరు చేయాలని కోరింది. ఇందుకు ఆమోదం తెలిపిన కేంద్రం 2013-14లో రూ.20 కోట్లు.. 2014-15లో రూ.37.20 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది. 2013-14లో రూ.20 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరం నిధులు ఇప్పటిదాకా విడదల చేయలేదు.

దాంతో.. భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని స్విమ్స్ నేతృత్వంలోని శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రుయా ఆసుపత్రి వర్గాలు.. జూనియర్ డాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసూతి ఆసుపత్రికే ఆ భవనాన్ని కేటాయించాలంటూ భారీ ఎత్తున ఉద్యమించారు. ఈ వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. సెప్టెంబర్‌లో రుయా ఆసుపత్రికి వెళ్లిన తిరుపతి ఎంపీ వరప్రసాద్.. మూడు వందల పడకల ఆసుపత్రి స్థితిగతులపై సమీక్షించారు. కేంద్రం 2014-15లో నిధులు విడుదల చేయని విషయాన్ని రుయా అధికారవర్గాలు ఎంపీ దృష్టికి తీసుకొచ్చాయి. నిధుల విడుదలపై కేంద్రంతో చర్చిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ.. అదనంగా నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అదనంగా రూ.20.10 కోట్లు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 27న ప్రతిపాదనలు పంపారు. అంటే.. ప్రసూతి ఆసుపత్రికి నేషనల్ హెల్త్ మిషన్ కింద మొత్తం రూ.77.30 కోట్లను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రతిపాదలనపై కేంద్రం ఆమోదముద్ర వేసింది.

రూ.57.30 కోట్లతో మూడు వందల పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం.. రూ.20 కోట్లతో అధునాతన పరికరాలు కొనుగోలు చేయాలని కేంద్రం సూచించింది. నిధులను సకాలంలో విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించడంతో రుయాలోని ప్రసూతి ఆసుపత్రి భవన నిర్మాణం వేగం పుంజుకోనుంది. మూడు వందల పడకల ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. గర్భిణులకు సమస్యలు తీరినట్లవుతుందని రుయా అధికారవర్గాలు పేర్కొన్నాయి.
 

మరిన్ని వార్తలు