బందరు అభివృద్ధికి సమష్టి కృషి : మంత్రి కొల్లు

7 Jul, 2014 01:55 IST|Sakshi
బందరు అభివృద్ధికి సమష్టి కృషి : మంత్రి కొల్లు

మచిలీపట్నం టౌన్ : బందరు ప్రాంత అభివృద్ధికి సమష్టిగా పని చేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యాన ఆదివారం ఆలయ ప్రాంగణంలో మంత్రి, మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులను ఘనంగా సత్కరించారు.

ఆలయ అర్చకులు సూర్యనారాయణ, శ్రీరాములు అమ్మవారి సమక్షంలో వీరికి ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కొల్లు మాట్లాడుతూ బందరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బందరు అభివృద్ధికి సహకరించే  పోర్టు అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని నియోజకవర్గ సమీక్షలో ప్రతిసారి చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు.

అలాగే కోస్తాతీరంలో నూతన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు వినతి పంపారన్నారు. బందరు పట్టణంలో తాగునీటి వసతి, డ్రెయిన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనపై నియోజకవర్గ ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించారని, అలాగే చంద్రబాబు మంత్రి పదవిని ఇవ్వడం, మునిసిపాలిటీ, మండల పరిషత్‌లను ప్రజలు తమ పార్టీకే అప్పగించడంతో తన బాధ్యతను మరింత ఎక్కువ చేశారన్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము కానీయకుండా పనిచేస్తానని రవీంద్ర అన్నారు.
 
కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మారుతీదివాకర్, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, బచ్చుల అర్జునుడు, బూరగడ్డ రమేష్‌నాయుడు, గొర్రెపాటి గోపీచంద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు సామ కాంతారావు, సహాయ కార్యదర్శి బైసాని హయగ్రీవరావు, కోశాధికారి ఉడత్తు శ్రీనివాసరావు, ఆర్యవైశ్య ప్రముఖులు గుడివాడ రామచంద్రరావు, తాడేపల్లి మెహర్‌బాబా,జంగాల హరనాథ్‌బాబు, బెల్ ఏజీఎం డీ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రి కొల్లు, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, కౌన్సిలర్లను ఆలయ మర్యాదలతో పూర్ణకుంభాలతో వేద పండితులు స్వాగతం పలికారు.
 

మరిన్ని వార్తలు