రైలు ఆపితే జైలే : డీజీపీ దినేష్‌రెడ్డి

9 Aug, 2013 04:56 IST|Sakshi
రైలు ఆపితే జైలే : డీజీపీ దినేష్‌రెడ్డి

సీమాంధ్ర ఉద్యమకారులకు డీజీపీ దినేష్‌రెడ్డి హెచ్చరిక
 విభజన గురించి 15 రోజుల ముందే తెలుసని స్పష్టీకరణ

 
 సాక్షి, హైదరాబాద్: రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు పట్టాలపైకి వెళితే.. నాన్‌బెయిలబుల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, చిన్న రాయిని ముట్టుకున్నా కేసు పెడతామని డీజీపీ వి.దినేష్‌రెడ్డి హెచ్చరించారు. రైల్‌రోకో చేయాలనే నిర్ణయాన్ని సీమాంధ్ర ఉద్యమకారులు విరమించుకోవాలని సూచించారు. రైల్‌రోకోలపై నిషేధం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. గురువారమిక్కడ డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆందోళనకారులను గుర్తిం చేందుకు రైల్వేస్టేషన్లు, రైలు పట్టాలపైనా వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు.
 
  హెలికాప్టర్ ద్వారా ఏరియ ల్ సర్వే చేస్తున్నామని వివరించారు. రైల్‌రోకోను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న అదనపు బలగాలకు తోడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ను కూడా రంగంలోకి దించుతున్నామన్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల రైలు మార్గం మధ్యలో మన రాష్ట్రం ఉందని, ఇక్కడ రైల్‌రోకో నిర్వహిస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం 15 రోజుల ముందుగానే తనకు తెలుసని, ముందస్తు జాగ్రత్తగా సీమాంధ్రలో 55 కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించామని డీజీపీ వెల్లడించారు.
 
 ర్యాలీలకు రాజధానిలో అనుమతిలేదు
 సమైక్యాంధ్ర కోరుతూ హైదరాబాద్‌లో ర్యాలీలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతీ లేదని దినేష్‌రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంతోపాటు పలు కార్యాలయ ఉద్యోగులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అయితే, సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా వ్యవహరించవద్దన్నారు. రాజధానిలో నివసించే సీమాంధ్ర ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని, ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏపీఎస్పీ డీఐజీ షేక్ మహ్మద్ ఇక్బాల్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ చెప్పారు.
 
 పోలీసులకు ప్రాంతీయ వైషమ్యాలు లేవు..
 పోలీసు అధికారులు, సిబ్బందికి రాజకీయ, కుల, మత, ప్రాంతీయ విభేదాలు ఉండవని డీజీపీ అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని తెలిపారు. సీమాంధ్ర ఆందోళనల విషయంలో డీజీపీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. విగ్రహాల ధ్వంసం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం ఘటనలపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వివరించారు.
 
 ఆందోళనలను చానళ్లలో పదేపదే చూపించడం మంచిది కాదని, కేబుల్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీవీ చానల్ యాజమాన్యాలకు సమాచారం పంపామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ చెప్పారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై  హత్య కుట్రకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, హత్యకు సుపారీ ఇచ్చిన వ్యవహారంపై ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తామని డీజీపీ చెప్పారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించినా, ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా రైల్వే చట్టాన్ని ప్రయోగిస్తామని పోలీసుశాఖ స్పష్టంచేసింది. రైళ్లను అడ్డుకోవడం, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం వంటి నేరాలకు ఏడాది జైలు నుంచి జీవిత ఖైదు వరకూ విధించే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారుల స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు