మిన్నంటిన సమైక్య ఆందోళనలు

9 Aug, 2013 04:56 IST|Sakshi

సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనపై సర్వత్రా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా తొమ్మిదో రోజు గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలకు ఉద్యమ కారులు కర్మకాండలు చేశారు. సినిమా థియేటర్లలోఉదయం, మధ్యాహ్నం షోలు రద్దయ్యాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అనంతపురం నగరంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులందరూ ఆందోళనలో పాల్గొనడంతో సుభాష్ రోడ్డు నల్లకోట్లమయమైంది. టవర్‌క్లాక్ వద్ద నాన్‌పొలికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఉద్యమకారులకు మద్దతు ప్రకటించారు.


అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం ప్రజాస్వామ్య బద్దంగా పోరాడే ఉద్యమకారులపై పోలీసులు అక్రమ కే సులు బనాయిస్తే.. భయపడాల్సిన పనిలేదన్నారు. తాము ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఉద్యమకారుల తరఫున వాదించి బెయిల్ ఇప్పిస్తామని స్పష్టం చేశారు. న్యాయవాదుల ర్యాలీలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇంటెల్, ఎస్కేడీ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. టవర్‌క్లాక్ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. నగరంలోని విద్యార్థులు రోడ్డుపై కూర్చొని చదువుకుంటూ నిరసన తెలిపారు. ఓ ఇటలీ తల్లీ.. మా చదువులు పాడుచేయొద్దు.. రోడ్లపైనైనా చదువుకుంటాం.. రాష్ట్ర విభజనకు ఒప్పుకోం.. అని ప్లకార్డులను ప్రదర్శించారు. వీరి వినూత్న నిరసనకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి.


నీటి పారుదల, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల ఐక్యవేదిక, వ్యవసాయశాఖ, ఏపీఎస్ ఆర్టీసీ ఎన్‌ఎంయూ, మెడికల్ అండ్‌హెల్త్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. రాజస్థాన్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు రోడ్డుపై వంటావార్పు చేపట్టి సమైక్య వాదులకు భోజనం పెట్టారు. సహారా ఇండియా పరివార్ ఆధ్వర్యంలో సమైక్యవాదులకు నీళ్ల ప్యాకెట్లు ఉచితంగా అందజేశారు. నగరంలోని పలు వీధులు, పలు అపార్టుమెంట్ల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రాష్ట్ర విభజనకు నిరసన తెలిపారు. టవర్‌క్లాక్ సర్కిల్, సప్తగిరి సర్కిళ్లలో సోనియా, కేసీఆర్, ద్విగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి దహనం చేశారు. తపోవనం వద్ద జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎస్కే యూనివర్సిటీలో యూపీఏ సర్కారు కోమాలో ఉన్నట్లుగా.. బీసీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు జయపాల్‌యాదవ్ శరీరమంతా కట్లుకట్టుకుని సెలైన్ ఎక్కించుకుని అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్తున్నట్లు ప్రదర్శించారు. వర్సిటీ ఎదుట రాస్తారోకో చేశారు. వీరికి  వీసీ రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ గోవిందప్ప మద్దతు ప్రకటించారు.


జిల్లాలో ఆగని ఉద్యమ జ్వాలలు.. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శాంతి హోమం, సర్వమత ప్రార్థనలు చేపట్టారు. సీమాంధ్రకు న్యాయం జరగకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేయనని ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. సోనియాగాంధీ, కేసీఆర్, దిష్టిబొమ్మలకు పిండప్రదానం చేశారు. వేద బ్రాహ్మణులు, క్రైస్తవుల ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో ప్రార్థనలు జరిపారు. ఆర్టీసీ కార్మికులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు గొడుగులతో వినూత్న నిరసన తెలిపారు. వినయ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోనియా, చిరంజీవి, కేసీఆర్ దిష్టిబొమ్మలకు ఉరి తీసి నిరసన తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చిలమత్తూరు, లేపాక్షి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండల కేంద్రాల్లో సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసి.. రోడ్లపై వంటా-వార్పు చేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గం నేత డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో అమడగూరులో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాల్లో నిరసనలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలతో విభజన మంటలు ఎగిసిపడ్డాయి. కదిరిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు.
 క్రైస్తవ సంఘాలు, వేద బ్రాహ్మణులు అంబేద్కర్ కూడలిలో ప్రార్థనలు జరిపి మానవహారం ఏర్పాటుచేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆర్‌టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు వేర్వేరుగా నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు వారు పని చేస్తున్న గ్రామాల్లో సమైక్యాంధ్రపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీలు నిర్వహించారు. కళ్యాణదుర్గం, మడకశిర నియోజకవర్గాల్లో ఆందోళనలు కొనసాగాయి. రాస్తారోకోలతో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కొత్తచెరువులో వైఎస్సార్‌సీపీ నాయకులు సోనియాగాంధీ, చంద్రబాబు దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఓడీసీలో సోనియా, దిగ్విజయ్‌సింగ్‌లకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆలయంలో భజన చేశారు. పుట్టపర్తిలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా.. విద్యార్థులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. పెనుకొండలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టుకుంటూ రోడ్డుపై ఊరేగించి, అనంతరం దహనం చేశారు. రాయదుర్గంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు, విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాప్తాడులో బైక్ ర్యాలీ, మానవహారాలతో ఉద్యమం హోరెత్తింది. శింగనమలలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి.. రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. ఉరవకొండలో ఆర్టీసీ ఎన్‌ఎంయూ ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేశారు.

మరిన్ని వార్తలు