గడప దాటాలంటే వణుకు

28 Sep, 2018 08:09 IST|Sakshi

పర్యటనలు, కార్యక్రమాలకు అధికారపార్టీ నేతలు దూరం

మన్యంలో నాయకులు బిక్కుబిక్కు

మైదానంలోనూ భయం భయం చింతపల్లిలో డీజీపీ సమీక్ష

సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతలందరిలోనూ ఒక్కటే భయం.. ఇళ్ల నుంచి బయటకు వెళితే ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన. మావోయిస్టులు ఇన్నాళ్లూ మన్యంలో ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఏజెన్సీ ప్రాంతంలోని నాయకుల్లోనే ఆందోళన రేకెత్తేది. ఈనెల 23న జిల్లాలోని డుంబ్రిగుడ మండలంలివిటిపుట్టులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మట్టుబెట్టిన నాటి నుంచి మైదాన ప్రాంత అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లోనూ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మన్యంలో నేతలతో పాటు మైదానంలో ఉంటున్న ప్రజాప్రతినిధులు విశాఖ నగరంలోని సురక్షిత ప్రాంతాలకు వచ్చేయాలని సూచించారు. కానీ పోలీసుల సూచనల మేరకు ఇప్పటిదాకా విశాఖలోకి అధికార పార్టీ ముఖ్య నేతలు రాలేదు. ఏజెన్సీలో ఉన్న ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రతను కల్పించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటివద్ద మరో ఆరుగురు అదనపు సాయుధ పోలీసులను, మాజీ మంత్రి మణికుమారికి కూడా భద్రతను పెంచారు. బుధవారం గిడ్డి ఈశ్వరి ఇంటికి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ సంచరించి మాయమైనట్టు గుర్తించారు.

ఆమె మావోయిస్టా? మిలీషియా సభ్యురాలా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ వ్యవహారం వెలుగు చూడడంతో అక్కడ ఏదైనా పథక రచనకు వచ్చి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీలో మిగిలిన అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లను వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మావోయిస్టుల హిట్‌లిస్టులో  దాదాపు 200 మంది వరకు చిన్నా, పెద్ద నాయకులున్నట్టు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల నాయకులు ఆడుగు బయట పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. కొద్దిమంది మాత్రం రహస్య ప్రదేశాలకు వెళ్లిపోయారు. మన్యంలో నిన్న మొన్నటి వరకు హడావుడి చేస్తూ కనిపించిన వారెవరూ ఇప్పుడు జనావాసాల్లో కనిపించడం లేదు. రోడ్లపై వారితో పాటు వారి వాహనాల జాడా లేకుండా పోయింది. ఏజెన్సీలో ఏ గ్రామంలో చూసినా బితుకుబితుకుమంటూ ఉన్న వారే కనిపిస్తున్నారు. పలు గ్రామాల్లో సాయుధులైన పోలీసు బలగాలు దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా పహరా కాస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో పోలీసు దళాలు లేకపోయినా అక్కడ కూడా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు భయంతో వణుకుతున్నారు.

నర్సీపట్నానికి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నారు. దీంతో ఆయన చాలా సంవత్సరాలుగా విశాఖలోనే కుటుంబంతో ఉంటున్నారు. ఆయనకు ప్రభుత్వం బులెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చింది. తాజాగా మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో ఆయన తన నియోజకవర్గానికి , మరో ప్రాంతంలో పర్యటనకు వెళ్లడం లేదు. మరోమంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా కిడారి, సివేరిల హత్య అనంతరం భద్రతను పెంచారు. వీరు జిల్లాలో మరెక్కడా అధికార, అనధికార కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో యలమంచిలి, పాయకరావుపేట ఎమ్మెల్యేలు విశాఖలోనే ఉంటున్నారు. చోడవరం, అనకాపల్లి శాసనసభ్యులు వారి గ్రామాల్లో  మకాం ఉంటున్నారు. ఈ కిడారి, సివేరిల హత్య, పోలీసుల హెచ్చరికలు నేపథ్యంలో శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. 

మరోవైపు బుధవారం జిల్లాకు వచ్చిన డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ గురువారం కూడా ఏజెన్సీలో పర్యటించారు. చింతపల్లి పోలీస్‌ సబ్‌ డివిజన్‌కు వెళ్లి అక్కడ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సెక్యూరిటీ ఆడిట్‌ రెవ్యూ నిర్వహించారు. ఆ డివిజన్‌లోని జీకేవీధి, అన్నవరం, సీలేరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్, ఆయా స్టేషన్ల సీఐ, ఎస్‌ఐలతో భేటీ అయ్యారు. డీఐజీ శ్రీకాంత్‌ కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు