ఆ దేవాలయాలకు దేవుడే దిక్కు

9 Jul, 2016 12:21 IST|Sakshi

రాజుల హయాంలో దేదీప్యమానంగా వెలిగిన ఆలయాలు శిథిలావస్థకు చేరాయి. అప్పట్లోనే రాజులు దేవాలయాలకు అప్పగించిన మాన్యాలు ఇప్పుడు కొందరి స్వార్ధపరుల చేతికి చిక్కాయి. ఆలయాల ఖజానాకు చిల్లిగవ్వ కూడా చేరకపోతుండటంతో దూపదీప నైవేద్యాలు లేకుండా పోయాయి. చివరకు హారతిపట్టే పూజారులు కరువైపోయారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలకు పూర్వవైభవం కల్పించాలనే ఆలోచన దేవాదాయ శాఖకు కూడా లేకపోవడంతో క్రమేణా శిథిలావస్థకు చేరిపోయాయి. నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని ఆలయాల దుస్థితి ఇది.
 
డక్కిలి: ఒకప్పుడు నిత్యం వేదమంత్రాలు మార్మోగిన ఆ గుడులు ఇప్పుడు మూగబోతున్నాయి. మోపూరులో వందల ఏళ్ల క్రితం చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలను వెంకటగిరి రాజాలు నిర్మించారు. దూపదీప నైవేద్యాల కోసం సుమారు ఏడు ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించారు. ఈ భూములు ఇప్పటికీ ఉన్నప్పటికీ ఆలయాల నిర్వహణను పట్టించుకునే వారు లేకుండా పోయారు. చెన్నకేశవస్వామి నామమాత్రంగా చీకటిలో పూజలందుకుంటుండగా, ఇదే ఆలయ ప్రాంగనంలోని ఆంజనేయస్వామికి ఎప్పుడో ఒకసారి పూజలు జరుగుతున్నాయి. దగ్గవోలులో చోళ రాజుల హయాంలో చెన్నకేశవస్వామి, నాగలింగేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. ఈ రెండు ఆలయాల్లో పూజలకు 21 ఎకరాలు మాన్యం కేటాయించారు. 1970 వరకు నిత్యం పూజలు జరిగేవి. చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి వారి మూలవిరాట్టు, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు, 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు ఉండేవి. ప్రస్తుతం ఆళ్వారుల విగ్రహాలు కనిపించడం లేదు. 1920 వరకు గరుడ వాహన ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగేదని పెద్దలు చెబుతున్నారు. గరుడ వాహనం ప్రస్తుతం శిథిలమైపోయింది. శ్రీదేవి అమ్మవారి విగ్రహాన్ని దొంగలించే ప్రయత్నం చేసిన దొంగలు వీలుపడక కింద పడేయడంతో స్వల్పంగా ధ్వంసమైంది. నాగలింగేశ్వరస్వామి ఆలయంలోని విగ్రహాలు కూడా రూపం కోల్పోయాయి. వెలికల్లులోని చెన్నకేశవస్వామి ఆలయానికి సుమారు 10 ఎకరాలకు పైగా మాన్యం ఉన్నా గుడి శిథిలావస్థకు చేరుకుంది.

నంది విగ్రహాల చోరీ
దగ్గవోలులోని నాగలింగేశ్వరస్వామి ఆలయంలోని రెండు నంది విగ్రహాలు చోరీకి గురయ్యా యి. ఎంతో చరిత్ర కలిగిన ఈ  ఆలయంలోని ఓ విగ్రహంలో నాలుగేళ్ల కిందట చోరీకి గురైంది. మరో విగ్ర హం గత ఏడాది ఏప్రిల్‌లో దొంగల పాలైంది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తీరిక లేదు..తర్వాత చూస్తామని ఈఓ సమాధానమిచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి చేయాలని కోరుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ఇక ఆలయాలకు దేవుడే దిక్కని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు