-

అసెంబ్లీలో బిల్లుపై చర్చ 23 రోజులు.. 56 గంటలు

31 Jan, 2014 02:42 IST|Sakshi

చర్చ జరిగిన సమయమిదే.. 86 మంది సభ్యులకే మాట్లాడే అవకాశం
 సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై శాసనసభ మొత్తం 23 రోజుల పాటు సమావేశమైంది. సగటున రోజుకు రెండున్నర గంటల చొప్పున సుమారు 56 గంటలకు పైగా చర్చించింది. ప్రస్తుతం 280 మంది ఎమ్మెల్యేలున్న సభలో 86 మందికి మాత్రమే విభజన బిల్లుపై అభిప్రాయాలు చెప్పే అవకాశం లభించింది. మిగతావారికి మాట్లాడే అవకాశం రాకపోవడంతో సుమారు 150 మంది తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేశారు. బిల్లుకు మొత్తం 9,072 సవరణలను సభ్యులు ప్రతిపాదించారు. ప్రస్తుత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 12నే ప్రారంభమయ్యాయి.
 
 -    తొలి రోజు నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతిపట్ల సంతాప తీర్మానం చేశారు. రెండో రోజు ఏ అంశంపై చర్చించాలనే విషయంలో సభ్యుల మధ్య గొడవ జరగడంతో సభ వాయిదా పడింది.
 -    మరోవైపు రాష్ట్రపతి పంపిన విభజన బిల్లు డిసెంబర్ 12న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి అందింది. దానిని ఆగమేఘాలపై సీఎం, గవర్నర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సంతకాలు చేయించి 13వ తేదీ మధ్యాహ్నానికి అసెంబ్లీకి పంపారు. అప్పటికే సభ వాయిదా పడటంతో దానిని సభలో ప్రవేశపెట్టలేదు.
 -    అసెంబ్లీ తిరిగి డిసెంబర్ 16న సమావేశంకాగా అప్పటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల అభ్యంతరాల మధ్య ప్రభుత్వం తరఫున విభజన బిల్లును ప్రవేశపెట్టడం వివాదాస్పదమైంది. ఆ రోజు నుంచి సభ గురువారం నిరవధిక వాయిదా పడేవరకు మొత్తం 23 రోజుల పాటు సమావేశమై 56 గంటలకుపైగా చర్చించింది.
 -    డిసెంబర్ 18న రెండు నిమిషాలపాటే సభ సమావేశమై అతితక్కువ సమయం సభ జరిగిన రోజుగా రికార్డుల్లోకి ఎక్కింది. అత్యధికంగా గత నెల 22న 9 గంటల 4 నిమిషాలు విభజన బిల్లుపై చర్చించినట్లు శాసనసభ సచివాలయ గణాంకాలు చెప్తున్నాయి.
 -    పార్టీల వారీగా చూస్తే మొత్తం 86 మంది సభ్యులు మాట్లాడగా వారిలో 42 మంది కాంగ్రెస్ వారే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తరఫున 22 మంది సభ్యులు ప్రసంగించారు. అలాగే 9 మంది టీఆర్‌ఎస్, ఏడుగురు వైఎస్సార్ కాంగ్రెస్, ఇద్దరు సీపీఐ, ఎంఐఎం, బీజేపీ, సీపీఎం, లోక్‌సత్తా, నామినేటెడ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చొప్పున చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మరిన్ని వార్తలు