నైరాశ్యంలో తమ్ముళ్లు

26 May, 2015 02:02 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మినీ మహానాడు సాక్షిగా అధినాయకులపై తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా ప్రయోజనం కనిపించలేదని పలువురు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా.. పార్టీ పదవులు లేవు.. పథకాలు దక్కటం లేదన్న అభిప్రాయం తమ్ముళ్లలో కనిపిం చింది. తమ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరులో సోమవారం టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఈ సందర్భంగా అనేకమంది టీడీపీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసిన దేశాయిశెట్టి హనుమంతరావు తమ సంగతేమిటని మంత్రి, జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించారు. మీరు పదవులు పొందారు.. మా గురించీ ఆలోచించండంటూ చురకలంటించారు. బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టత లేదు.. ఇప్పటికైనాస్వచ్ఛమైన నిర్ణయాన్ని ప్రకటించి రైతులకు రుణమాఫీపై ఉన్న సందేహాలను తీర్చాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలుకు జన్మభూమి కమిటీలు ఉన్నా.. అధికారులు తాము చెప్పిన వారికి ఇవ్వకుండా ఇష్టమొచ్చిన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. మెజారీటీ మండలాలు ప్రతిపక్షాల చేతిలో ఉండటంతో పథకాల అమలు తీరులో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. వైఎస్‌ఆర్ హయాంలో రూ.200 పింఛను తీసుకునేప్పుడు కనిపించిన ఆనందం ప్రస్తుతం రూ. వెయ్యి ఇస్తున్నా కనిపించటం లేదన్నారు.
 
 పార్టీని వీడిపోయే సందర్భంలో ఎమ్మెల్సీలు ఇచ్చారా?
 అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ జోత్స్నలత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడిపోతారన్న సందర్భంలో రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మహిళలకు పదవులేవీ ఇవ్వలేదని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, వారికి సముచిత స్థానం కల్పించాలని నేతలను కోరటం గమనార్హం.
 
 డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డి, సూళ్లూరుపేట జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానంగా ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కు గురవుతున్నారని గుర్తుచేశారు. అభివృద్ది అంటే సముద్రతీరంలో ఆరులైన్ల రోడ్లు, బకింగ్‌హాం కాలువ అభివృద్ధి మంచిదే అయినా... వాటి వల్ల చాల మత్స్యకార గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ విభాగం అధ్యక్షుడు పోల్‌శెట్టి ఆందోళన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు