పచ్చ మార్కు పాలన!

3 Mar, 2016 09:23 IST|Sakshi
పచ్చ మార్కు పాలన!

జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రొటోకాల్ ఉల్లంఘన
ప్రొటోకాల్‌పై ప్రశ్నిస్తేఅక్రమ కేసులు బనాయింపు  
నిన్న డాక్టర్ గోపిరెడ్డి, నేడు షేక్ మహ్మద్ ముస్తఫాపై తప్పుడు కేసులు

రాష్ర్టంలో అరాచకం రాజ్యమేలుతోంది. ప్రజాస్వామ్యంలో పాలకులు తప్పు చేస్తే ఎత్తిచూపేందుకు ప్రతిపక్షం ఉంటుంది. అయితే పచ్చ పాలకులు తప్పు అని ఎవ్వరు ప్రశ్నించినా అధికార బలంతో అణగదొక్కుతున్నారు. పాలనలో పెడధోరణులు చొప్పిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. సామాన్యులనే కాదు చివరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సైతం అక్రమ కేసులు పెడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.       
  
 సాక్షి, గుంటూరు : జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన నియోజకవర్గాల్లో ఓటమిపాలైన అధికార పార్టీ నేతలు ఇన్‌చార్జి పదవి అడ్డుపెట్టుకుని హల్‌చల్ చేస్తున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రొటోకాల్‌పై ప్రశ్ని స్తే తప్పుడు కేసులు పెట్టిస్తూ ఎమ్మెల్యేలను సైతం అరెస్ట్ చేయిస్తున్నారు. నియోజకవర్గాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. నిన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. నేడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫాపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. తప్పు ఒకరిది శిక్ష మరొకరిది అన్నట్లు పోలీసుల వ్యవహార శైలి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 ఫిర్యాదులు పట్టని ఉన్నతాధికారులు..    
 జిల్లాలో నరసరావుపేట, మాచర్ల, గుంటూరు తూర్పు, బాపట్ల, మంగళగిరి నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ నిధులతో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా.. జన్మభూమి లాంటి అధికారిక కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యేల కంటే ముందుగా అక్కడి టీడీపీ ఇన్‌చార్జిలకు అధికారుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శిలాఫలకాలపై సైతం ఇన్‌చార్జిల పేరు ఉంటోంది. వారి పేరు ఏ అధికారంతో పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులను ఎన్నిసార్లు కలిసి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 అంతూపొంతూలేని ప్రొటోకాల్ ఉల్లంఘనలు
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో సైతం కార్పొరేషన్ అధికారులు టీడీపీ ఇన్‌చార్జి మద్దాళ గిరిధర్‌ను వేదికపై కూర్చోబెట్టి అధికారికంగా ఆయనతో పింఛన్లు ఇప్పించడం వంటివి చేశారు. స్థానిక ఎమ్మెల్యేను అవమానిస్తూ అధికారులు చేస్తున్న ప్రొటోకాల్ ఉల్లంఘనలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. తాజాగా ఆదివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని చంద్రబాబు నాయుడు కాలనీ, మద్దిరాల కాలనీల్లో కార్పొరేషన్ నిధులతో నిర్మించిన సైడ్ డ్రైన్‌లు, రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపకపోవడంతో పాటు, టీడీపీ ఇన్‌చార్జి మద్దాళ గిరిధర్ పేరును శిలాఫలకంపై ఉండ టాన్ని జీర్ణించుకోలేని కొందరు వీటిని ధ్వంసం చేశారు. అయితే ఇదేదో ఎమ్మెల్యేనే చేసినట్లు ఆయనతో పాటు 56 మందిపై పెదకాకాని, గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు.

ఇప్పటికే పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు కూడా. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎమ్మెల్యే ముస్తఫాను సైతం అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ళ అప్పిరెడ్డి, రావి వెంకటరమణ, కావటి మనోహర్ నాయుడు, కొత్తా చిన్నపురెడ్డి, ఆళ్ళ వీరరాఘవమ్మ ఎస్పీని కలిసేందుకు రాగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగారు. గత నెలలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కూడా తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు