‘సాక్షి ఎఫెక్ట్’.. బాధితురాలికి వెంటనే వైద్యం!

7 May, 2018 20:31 IST|Sakshi

సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లా మోదుకూరు బాధితురాలికి ఎట్టకేలకు వైద్య చికిత్స అందింది. ‘సాక్షి’ కథనాలతో దిగివచ్చిన వైద్య బృందం.. బాధిత బాలికకు పరీక్షలు నిర్వహించింది. ఆసుపత్రికి బాలికను తీసుకొచ్చిన ఏడు గంటల తర్వాత తెనాలి డాక్టర్లు బాలికకు వైద్య పరీక్షలు చేశారు. శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు డాక్టర్లు పంపించారు. త్వరలోనే నివేదిక వస్తుందని హాస్పిటల్ సూపరింటెండెంట్ సనత్‌కుమార్ అన్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సూపరింటెండ్ తెలిపారు.

జిల్లాలోని మోదుకూరులో లైంగిక దాడికి గురైన ఏడేళ్ల బాలికను ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే గంటలు గడుస్తున్నా వైద్యులు బాధితురాలికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేశారు. గైనకాలజిస్టులు అందుబాటులో లేరంటూ వైద్య సిబ్బంది బాధిత చిన్నారికి పరీక్షలు చేయకపోవడంతో పాప కుటుంబీకులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. తమ పాపకు ఏమౌతుందోనని బాలిక కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సాయంత్రం ఐదు గంటలకు కూడా చికిత్స చేయడం లేదనే విషయాన్ని ‘సాక్షి’ టీవీ ప్రసారం చేసింది. దీంతో వైద్యులు స్పందించి బాలికకు చికిత్స అందించారు. రాష్ట్రంలో రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

గుంటూరులో మరో దారుణం

మరిన్ని వార్తలు