ప్రాథమిక ఆరోగ్యానికి సర్కారు భరోసా

12 Jul, 2020 04:18 IST|Sakshi

నాడు–నేడు ద్వారా 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహర్దశ 

కొత్త నియామకాలతో 24 గంటలూ పీహెచ్‌సీల్లో వైద్యులు 

త్వరలో పీహెచ్‌సీలకు 680 మంది వైద్యులు  

ఆరోగ్యాంధ్ర యాప్‌ ద్వారా సేవలపై ప్రత్యేక దృష్టి 

ఐటీ ఆధారిత సేవలతో పీహెచ్‌సీల్లో మెరుగైన సేవలు 

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లకు 11 వేల మందికిపైగా ఏఎన్‌ఎంలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా వైద్య రంగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. టెలీ మెడిసిన్‌నుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానించాలని తాజాగా నిర్ణయించింది. ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా లేదు. ఫోన్‌ చేస్తే చాలు 

సమస్యలు వినడం, వాటిని పరిష్కరించడం, మందులు అవసరమైతే ఇంటికే పంపించడం చకచకా జరిగిపోతున్నాయి. బయటకు వెళ్ల లేని చాలా మంది టెలీ మెడిసిన్‌ ద్వారా వైద్య సలహాలు, సూచ నలు పొందుతున్నారు. ఇంటి వద్దకే వచ్చి మందులు ఇచ్చిపోతుంటే ఆనం దం పొందుతున్నారు. ఇప్పటి వరకు 31 వేల పైచిలుకు మంది టెలీ మెడిసిన్‌ 14410 నంబర్‌కు ఫోన్‌ చేసి వైద్యుల సూచనలు, సలహాలు పొందారు. 

టెలీ మెడిసిన్‌తో వెయ్యి పీహెచ్‌సీల అనుసంధానం 
► ఉచితంగా వైద్యం అందించే ఆసుపత్రులు గ్రామీణ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయా? వాటిలో 24 గంటలూ వైద్య సేవలందుతాయా? వైద్యులు, నర్సులు ఎప్పుడూ అక్కడే ఉంటారా? ఇంటి ముంగిటకే డాక్టర్‌ వస్తారా? మందులు ఉచితంగా ఇస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ రాష్ట్రంలో ‘అవును’ అనే సమాధానం వస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరులో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.  

అప్పుడలా.. ఇప్పుడిలా.. 
► గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఆరోగ్య రంగం పరిస్థితి దారుణంగా ఉండేది. డాక్టరు ఉంటాడో ఉండడో.. మందులు అందుబాటులో ఉన్నాయో లేదో.. చివరకు కట్టు కట్టడానికి బ్యాండేజ్‌ కూడా ఉండని పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారు. అవసరమైన మందులన్నీ ఉచితంగా ఇస్తారు. ప్రసవానికి వెళితే గైనకాలజిస్ట్‌ ఉండరన్న భయం లేదు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు అవసరమైతే భరోసా ఇచ్చేలా బోధనాసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. ఫోన్‌ చేస్తే చాలు 108 వేగంగా రావడం మొదలైంది. రక్త పరీక్షల నుంచి వైద్య సేవల వరకూ ఇంటి ముంగిటకే వచ్చి పరీక్షించే 104 వాహనాలు పల్లెలకు తరలి వెళ్లాయి. వీటన్నింటికీ తోడు అపర సంజీవని ఆరోగ్యశ్రీ పెద్దన్నయ్యలా అండగా నిలబడింది. వెరసి పేద వాడికి ఎలాంటి జబ్బు చేసినా, అండగా మేమున్నాం అంటూ సర్కారు నిలబడిన తీరు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. 

ఆరోగ్యాంధ్ర యాప్‌తో పీహెచ్‌సీల అనుసంధానం 
​​​​​​​► రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ ఆరోగ్యాంధ్ర యాప్‌తో అనుసంధానిస్తున్నారు. దీంతో రెస్పాన్స్‌ సిస్టంను ఏర్పాటు చేసి.. ఎవరైనా వైద్య సేవలు అందడం లేదని ఆరోగ్యాంధ్ర యాప్‌లో కామెంట్‌ పెడితే చాలు.. వెంటనే స్పందించి సదరు డాక్టర్‌ లేదా సిబ్బందికి సమాచారం వెళుతుంది. 
​​​​​​​► వారు వెంటనే సేవలు అందేలా చర్యలు తీసుకుంటారు. దీనికోసం ప్రత్యేకంగా ఐటీ సిబ్బంది పనిచేస్తున్నారు. 
​​​​​​​► పీహెచ్‌సీల్లో 217 రకాల మందులు అందుబాటులో ఉండాలనేది నిబంధన. కానీ గతంలో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండేవి కావు.   
​​​​​​​► ఇప్పుడు అక్కడి అవసరాలు, జబ్బుల తీరును బట్టి, సీజన్‌లో వచ్చే వ్యాధులను బట్టి గరిష్టంగా 180 నుంచి 190 రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

15 రకాల యాప్‌లతో సేవలు 
​​​​​​​► ఐటీ సేవలు మరింతగా బలోపేతమయ్యాయి. ప్రస్తుతం 15 యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సేవలు అందిస్తున్నారు.  
​​​​​​​► గర్భిణులకు వైద్య పరీక్షలు, ప్రసవానికి  సూచనలు సలహాలు, హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వంటివాటికి ఐటీ ఆధారిత యాప్‌ల ద్వారానే సేవలు అందిస్తున్నారు. 

నాడు–నేడుతో మహర్దశ 
నాడు–నేడు కార్యక్రమం కింద చేపట్టే పనులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. మొత్తం 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించనున్నారు. 2021 సెప్టెంబర్‌ లక్ష్యంగా పనులు పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది.   

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు 
​​​​​​​► ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు ప్రతి గ్రామ, పట్టణాల్లోని ప్రతి వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తోంది.   
​​​​​​​► ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలకు 11 వేల మంది పైచిలుకు ఏఎన్‌ఎం (ఆగ్జిలరీ నర్స్‌ మిడ్‌వైఫరీ)లను నియమించింది. 
​​​​​​​► వీళ్లందరికీ త్వరలోనే యాప్‌లతో కూడిన ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో తగినన్ని మందులు అందుబాటులో ఉంచి, తక్షణ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు.  
​​​​​​​► ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11,197 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అందుకుగాను రూ.1,745 కోట్లు వ్యయం చేయనున్నారు. 

​​​​​​​► గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పణిదెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గతంలో 70 రకాల మందులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 170కి పెరిగింది. గతంలో రోజుకు 60 నుంచి 70 మంది మాత్రమే ఔట్‌ పేషెంట్లు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 130 నుంచి 140కి పెరిగింది. పీహెచ్‌సీ లెవెల్‌లో కావాల్సినంత ఫర్నిచర్‌ వచ్చింది. కంప్యూటర్లు, రిఫ్రిజిరేటర్‌ను కూడా సమకూర్చారు. పేషంట్లు కూర్చోవడానికి వెయిటింగ్‌ హాల్‌ను బాగా తీర్చిదిద్దారు. డాక్టర్, ఫార్మసిస్ట్, ఇతర సిబ్బంది కొరత లేదు. ఇదొక్కటే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీలన్నీ ఇలా రూపు రేఖలు మారిపోయాయి.    

ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ బలోపేతం 
జబ్బులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వైద్యం చేస్తే తీవ్రత తగ్గించవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పీహెచ్‌సీల్లో అన్ని వసతులూ కల్పిస్తున్నాం. బహుశా ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు కింద పనులు మొదలయ్యాయి. కొద్ది నెలల్లోనే దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. 
–డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ 

మరిన్ని వార్తలు