కలహాల కాపురం

28 Jan, 2018 12:53 IST|Sakshi

అధికార పార్టీలో ఆధిపత్య పోరు

సీటు నుంచి పింఛన్‌ వరకూ ఇదే తీరు

 ఏకాభిప్రాయం కుదరక మార్కెట్‌ కమిటీల నియామకంలో జాప్యం

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికార పార్టీ నేతల్లో లుకలుకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కర్నూలులో తమకే పార్టీ టికెట్‌ అని ఎంపీ టీజీ వెంకటేష్‌ కుమారుడు టీజీ భరత్‌ అంటుంటే.. కాదు తనకే అని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. తాను చెప్పిన వారికే పింఛన్‌ ఇవ్వాలని కోడుమూరు నియోజకవర్గంలో ఒక నేత హుకుం జారీచేస్తుంటే.. ఎమ్మెల్యే కాబట్టి తన మాటకే ప్రాధాన్యతివ్వాలని మణిగాంధీ అంటున్నారు. ఇక ఏకంగా ఫ్లెక్సీలోనూ సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ఫొటోనూ వేసేది లేదని తుగ్గలి నాగేంద్ర తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే విభేదాలు గుప్పుమంటున్న నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి వస్తుండటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. పార్టీ మారిన ఎంపీ బుట్టా రేణుకతో తనకు ఇబ్బందులు తప్పవనుకుంటున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి.. ఎంపీతో కనీసం కలిసేందుకూ ససేమిరా అంటున్నారు. నంద్యాలలో మార్కెట్‌ కమిటీ ఎంపిక విషయంలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, శాసన మండలి చైర్మన్‌ ఫరూఖ్‌ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఆళ్లగడ్డ సీటు తనదేనంటూ ఏవీ సుబ్బారెడ్డి కొత్త రాగం అందుకున్నారు.  

అన్ని చోట్లా ఇదే తీరు
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఇప్పటికే ఎస్వీ మోహన్‌ రెడ్డి, టీజీ భరత్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక కర్నూలు మార్కెట్‌ కమిటీ ఎంపిక విషయంలో ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ మధ్య ఏకాభిప్రాయం ఏమాత్రమూ కుదరడం లేదు. దీంతో  మార్కెట్‌ కమిటీ ఎంపిక ఏడాదిన్నరగా జరగడం లేదు.  నంద్యాల మార్కెట్‌ కమిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఒక వర్గానికి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మరో వర్గానికి ఫరూఖ్‌ మద్దతు ఇస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పూర్తిస్థాయిలో మద్దతిచ్చినా.. ఇదేనా తమకిచ్చే గౌరవమని ఫరూఖ్‌ వర్గం మండిపడుతోంది. కోడుమూరు నియోజకవర్గంలో ఏకంగా  పింఛనుదారుల ఎంపిక నుంచీ విభేదాలు గుప్పుమంటున్నాయి.

ఆళ్లగడ్డలో విందు పేరిట ఏవీ సుబ్బారెడ్డి చేస్తున్న రాజకీయాలను అడ్డుకునేందుకు మంత్రి అఖిలప్రియ ఎంతగా ప్రయత్నిస్తున్నా.. సాధ్యం కావడం లేదు. ఆయన ఏకంగా భూమా  కుటుంబ సభ్యులను కూడా తన విందుకు రప్పించుకున్నారు. పైగా ఆళ్లగడ్డ సీటు తనదేనని మిత్రుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో పనులన్నీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి మాత్రమే చేస్తున్నారని, తమకు ఇవ్వడం లేదని మిగిలిన నేతలు మండిపడుతున్నారు. స్వయాన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలోనూ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తుగ్గలి నాగేంద్ర వేసే ఏ ఫ్లెక్సీలోనూ కేఈ వారి పేరు కనీసం ప్రస్తావించడం లేదంటే విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  

ఊసేలేని సమన్వయ కమిటీ.. అప్పటికే పార్టీలో ఉన్న వారికి, గోడ దూకి వచ్చిన ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని భావించిన అధికార పార్టీ  సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రితో పాటు జిల్లా అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. కొద్దికాలం నుంచి క్రమంగా పెరుగుతున్న విభేదాలను పరిష్కరించేందుకు  సమన్వయ కమిటీ కనీసం భేటీ కూడా కావడం లేదు. గతంలో నెలకొక్కసారి కూర్చుని మాట్లాడేవారు. ఇప్పుడు కమిటీ పత్తా లేకుండా పోయింది. అంటే ఈ విభేదాలను ఇక పరిష్కరించలేమని అధికార పార్టీ నేతలు భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది.   

మరిన్ని వార్తలు